CM Revanth Reddy | గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డి

శతాబ్దాలుగా హైదరాబాద్ నగరం 'గంగా జమునా తెహజీబ్ గా సంస్కృతికి ప్రతీకగా బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనంతో సాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కోన్నారు.

  • Publish Date - July 28, 2024 / 02:23 PM IST

ఆగాఖాన్ ట్రస్టు ఫర్ కల్చర్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : శతాబ్దాలుగా హైదరాబాద్ నగరం ‘గంగా జమునా తెహజీబ్ గా సంస్కృతికి ప్రతీకగా బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనంతో సాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కోన్నారు. ఆదివారం నగరంలోని కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమంలో భాగంగా కుతుబ్ షాహీ టూంబ్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ మొక్క నాటి హరిత స్ఫూర్తిని చాటారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేల ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు ప్రతి ఒక్కరిని ఆక్కున చేర్చుకుంటుందన్నారు. అలాగే శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలతో పాటు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారని, వారిలో ప్రతి ఒక్కరు తమదైన సాంస్కృతిక ముద్రను వేశారని తెలిపారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుందని చెప్పారు. 2013లో కుతుబ్ షాహి వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్ ఫౌండేషన్ చేపట్టిందని, రాష్ట్ర సాంస్కృతిక శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, 00 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణతో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద సాంస్కృతిక పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనమన్నారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి, ఉదారతకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ప్రజల తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.