శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్‌, 20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేందుకు రోహిత్‌, కోహ్లీలకు ఇదే సరైన సమయం … రోహిత్‌, కోహ్లీ బాటలోనే జడేజా

భారత క్రికెట్‌ జట్టు నూతన కోచ్ రేసులో ఉన్న మాజీ క్రికెటర్‌, బీజేపీ నేత గౌతమ్‌ గంభీర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న గంభీర్ సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

  • Publish Date - June 30, 2024 / 05:45 PM IST

విధాత, హైదరాబాద్ : భారత క్రికెట్‌ జట్టు నూతన కోచ్ రేసులో ఉన్న మాజీ క్రికెటర్‌, బీజేపీ నేత గౌతమ్‌ గంభీర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న గంభీర్ సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గంభీర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయానికి వచ్చిన గంభీర్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. అనంతరం గంభీర్ మాట్లాడుతూ టీమిండియా టీ 20 వరల్డ్ కప్‌ను గెలువడం అత్యంత సంతోషకరమన్నారు. రోహిత్‌, కోహ్లీ, కోచ్ ద్రవిడ్‌లకు అభినందనలు చెబుతున్నానన్నారు. 20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేందుకు రోహిత్‌, కోహ్లీలకు ఇదే మంచి సమయమని, వరల్డ్ కప్ గెలిచిన మధుర క్షణాల్లో వారు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనుకోవడం సరైన నిర్ణయమేనన్నారు. టెస్టు, వన్డేలలో వారి సేవలు కొనసాగిస్తారన్నారు. 20 ఫార్మాట్‌ వరల్డ్ కప్ గెలుపు భారత క్రికెట్ జట్టు భవిష్యత్తుకు అద్భుతంగా సాగేందుకు దోహదం చేస్తుందన్నారు.

కాగా కెప్టన్ రోహిత్‌శర్మ, కింగ్ కోహ్లీ బాటలోనే టీ 20ఫార్మాట్ క్రికెట్‌కు అల్‌రౌండర్ రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన చేశారు. ఇకముందు తాను అంతర్జాతీయ అధికారిక టీ20క్రికెట్ ఆడబోనని తెలిపారు. భారత్ తాజాగా సాధించిన 2024 టీ20 ప్రపంచ కప్‌లో సభ్యుడైన జడేజా ఇప్పటి వరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేసి.. 54 వికెట్లు పడగొట్టాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Latest News