Telangana Talli । ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు.. జీవో జారీ

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు తల్లి రూపం ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందింపజేశారు. అయితే.. బీఆరెస్‌ పదేళ్ల పాలనాకాలంలో దానిని అధికారికంగా ఆమోదించలేదు. తాజాగా ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని అభివర్ణిస్తూ జీవో జారీ చేసింది.

  • Publish Date - December 9, 2024 / 06:02 PM IST

Telangana Talli । తెలంగాణ తల్లికి రూపం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఇది పూర్తిగా తెలుగులో ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్ర బహుజనుల పోరాట పటమను, సాంస్కృతికంగ, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించినట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2024 డిసెంబర్ 9న ఆమోదించినట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక తేదీ అయిన డిసెంబర్ 9న ప్రతి ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ తల్లి సంప్రదాయ స్త్రీ మూర్తిగా, ప్రశాంత వదనంతో, బంగారు అంచుగలిగిన ఆకుపచ్చని చీరలో, సంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంఠె, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బట్టకమ్మలు, ముక్కుపుడకతో మధ్య వయసు స్త్రీ మూర్తులా ఎంతో స్ఫూర్తిదాయకంగా, హుందాగా రూపొందించినట్టు జీవోలో తెలిపారు.

కుడిచేత్తో అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో సంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు మన ప్రాంతీయ సంస్కృతికి చిహ్నంగా చూపించినట్లు జీవోలో పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ ఆత్మగౌర ప్రతీక కాబట్టి తెలంగాణ తల్లి రూపాన్ని చిత్రాన్ని వక్రీకరించడం గాని, వేరే విధంగా చూపించడం గానీ నిషేధించినట్లు జీవోలో తెలిపారు. తెలంగాణ తల్లి చిత్రరూపరేఖలను బహిరంగ ప్రదేశాలలో గాని, ఇతర ప్రదేశాలలో గానీ, ఆన్‌లైన్‌లో లేదా సామాజిక మాధ్యమాల్లో గానీ, మాటలు లేక చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 9వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తగిన విధంగా అధికారిక కార్యక్రమంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు జీవోలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరిట గవర్నర్ ఉత్తర్వుల మేరకు జీవో జారీ చేస్తున్నట్లు తెలిపారు.