వ‌డివ‌డిగా ధ‌ర‌ణి చ‌ట్ట స‌వ‌ర‌ణ దిశ‌గా సర్కార్‌ అడుగులు!

భూమి స‌మ‌స్య‌ల ప‌రిష్కారాన్ని సంక్లిష్టంగా మార్చిన ధ‌ర‌ణి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి

  • Publish Date - January 18, 2024 / 03:12 PM IST

  • అధికారాల వికేంద్రీక‌ర‌ణే లక్ష్యం 
  • గ్రామస్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ 
  • ప్రజలకు రెవెన్యూ సేవలు ఉచితం!
  • కోర్టుల చుట్టూ తిరిగే పనిలేదు
  • అప్పీల్ చేసుకునేందుకు అవ‌కాశం 
  • ఫైల్‌ సిద్ధం చేయాలని ఆదేశం!

విధాత‌ ప్రత్యేకం: భూమి స‌మ‌స్య‌ల ప‌రిష్కారాన్ని సంక్లిష్టంగా మార్చిన ధ‌ర‌ణి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధ‌ర‌ణి చ‌ట్టం భూమి స‌మ‌స్య‌ల ప‌రిష్కారాన్ని సంక్లిష్టంగా మార్చింద‌ని కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయం నుంచీ చెబుతూ వచ్చారు. ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో ప‌డేస్తామ‌ని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎన్నికల సభల్లో ప్రకటించారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఈ మేర‌కు ధ‌ర‌ణిపై నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా ప్ర‌భుత్వం ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నానికి క‌మిటీ వేసింది. మ‌రోవైపు క‌మిటీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌లు, ప్ర‌భుత్వాధినేత ఆలోచ‌న‌, అధికారుల అడుగుల‌ను పరిశీలిస్తే ధ‌ర‌ణి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసి, తాసీల్దారు నుంచి మొద‌లు అధికారులంద‌రికీ విచార‌ణ చేసి, నిర్ణ‌యం తీసుకునే అధికారాలిచ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఖ‌రీదుగా మారిన రెవెన్యూ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందించాల‌న్న ల‌క్ష్యంగా కాంగ్రెస్ స‌ర్కారు ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే భూమి త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు కోర్టుల చుట్టూ తిర‌గాల్సిన అవ‌సరం లేకుండా పై అధికారుల‌కు అప్పీల్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించే విధంగా ధ‌ర‌ణి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయాల‌న్న ఆలోచ‌న‌లో స‌ర్కారు ఉందని చెబుతున్నారు. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌డానికి ప్ర‌భుత్వం వేసిన క‌మిటీ కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఉచిత సేవలకు ధరణితో చరమగీతం

ఆనాడు తాసీల్దార్లు, ఆర్డీవోల‌కు ఉన్న‌విచార‌ణ అధికారాల‌ను ధ‌ర‌ణి చ‌ట్టం ద్వారా తీసివేసి అప్పటి ముఖ్యమంత్రి క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించారు. అలాగే భూమి, త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి నిర్ణీత చార్జీలు నిర్ణ‌యించారు. దీనితో రాష్ట్రంలో ఏ రెవెన్యూ కార్యాల‌యంలోనైనా ప్ర‌జ‌ల‌కు అందించే సేవ‌ల‌కు ఖ‌రీదు క‌ట్టారు. ఒకప్పుడు ఉచితంగా లభించిన సేవలకు గత ప్రభుత్వం దీని ద్వారా చరమగీతం పాడింది. తాసీల్దార్ల‌కు ఏదైనా ద‌ర‌ఖాస్తుపై నోటీస్ ఇచ్చే అధికారం కూడా నాడు కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ధ‌ర‌ణి చ‌ట్టం ద్వారా లేకుండా పోయింది. చివ‌ర‌కు అధికారుల‌మా? లేక అటెండ‌ర్ల‌మా? అన్న సందేహాలు కూడా తాసీల్దార్ల‌కు, ఆర్డీవోల‌కు కలిగాయి.

ప్ర‌జ‌ల‌కు భూమి, ఇత‌ర రెవెన్యూ సంబంధ‌మైన సేవ‌లు దూరం అయ్యాయి. ఖ‌రీదుగా కూడా మారాయి. మీ- సేవ‌లో ద‌ర‌ఖాస్తు చేస్తే ఆన్‌లైన్‌లో క‌లెక్ట‌ర్‌కు వెళుతుంది. క‌లెక్ట‌రే దీనిపై నోటీస్ జ‌న‌రేట్ చేయాలి. ఇలా జిల్లావ్యాప్తంగా వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌కు క‌లెక్ట‌ర్ చూసి నోటీస్‌లు జారీ చేయ‌డానికే దాదాపు ఆరునెల‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే ప‌రిస్థితి ఏర్ప‌డిందని చెబుతున్నారు. క‌లెక్ట‌ర్లు కూడా ప‌ని భారంతో రిజెక్ట్ చేయ‌డం మొద‌లుపెట్టడంతో ప్ర‌జ‌ల‌కు సులువుగా కావాల్సిన ప‌నులు సంక్లిష్టంగా మారాయని అంటున్నారు. అప్పీల్‌కు అవ‌కాశం లేకుండా పోయింది.

నిత్యం గ్రామాల్లో వ్య‌వ‌సాయం చేసుకునే రైతులు త‌మ ప‌నులు వ‌దిలిపెట్టి క‌లెక్ట‌ర్‌, హైద‌రాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాల‌యానికి తిర‌గ‌లేని ప‌రిస్థితి నాడు ఏర్ప‌డింది. కిందిస్థాయి అధికారుల‌కు నిర్ణ‌యాలు తీసుకొని ఉత్త‌ర్వులు ఇచ్చే అధికారం ధరణికి పూర్వం ఉండేది. ధరణిని తీసుకొచ్చిన తర్వాత తాసీల్దార్లు, ఆర్డీవోల‌కు ఆ అధికారం లేకుండా పోయింది. క‌లెక్ట‌ర్లు మాత్ర‌మే ఆదేశాలు ఇస్తారు. మరోవైపు పూర్తిగా సీసీఎల్ఏనే ఆదేశాలిచ్చే విధంగా ధ‌ర‌ణి చ‌ట్టాన్ని రూపొందించారు. దీంతో తాసీల్దార్లు, డిప్యూటీ క‌లెక్ట‌ర్లు తెలంగాణ‌లో నామమాత్రపు అధికారులుగా మిగిలారు. క‌లెక్ట‌ర్లు, సీసీఎల్ఏ ఇచ్చే ఆదేశాల‌పై అప్పీల్‌కు ఎలాంటి అవ‌కాశం లేదు. ప్ర‌భుత్వం ఇచ్చే ఆదేశాల‌పై ఏమైనా అభ్యంత‌రాలుంటే ప్ర‌జలు నేరుగా కోర్టుకే వెళ్లాల‌ని నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలోనే ప్ర‌క‌టించారు.

దీంతో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి అందే భూమి సేవ‌లు అంద‌ని ద్రాక్ష‌లాగా త‌యార‌య్యాయి. రికార్డులో ఐదు గుంట‌ల భూమి త‌క్కువ ప‌డింద‌ని అదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ మ‌హిళా రైతు హైకోర్టును ఆశ్ర‌యించాల్సిన దుస్థితి నాడు ఏర్పడింది. దీనిపై హైకోర్టు న్యాయ‌మూర్తి నేరుగా ప్రతి రోజూ ప‌దుల సంఖ్య‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌పైనే విచారించాలా? అని సీసీఎల్ఏను అడిగిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. 

అధికారాల వికేంద్రీకరణ దిశగా కొత్త సర్కార్‌ ఆలోచన

ధ‌ర‌ణి వెబ్ సైట్ కోసం రికార్డ్స్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు నాటి కేసీఆర్ ప్ర‌భుత్వం చేసింది. దీంతో అప్ప‌టివ‌ర‌కు గ్రామస్థాయిలో భూముల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఉన్న వీఆర్వో, వీఆర్ఏ వ్య‌వ‌స్థలు రద్దయ్యాయి. డిప్యూటీ క‌లెక్ట‌ర్ల వ‌ర‌కు ఉన్న విచార‌ణ అధికారాల‌న్నీ పోయాయి. దీంతో ప్ర‌జ‌లకు స‌మ‌స్య‌ల ప‌రిష్కార వ్య‌వ‌స్థ అంద‌నంత దూరం వెళ్లింది. సేవ‌లూ ఖ‌రీద‌య్యాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్నకాంగ్రెస్ ప్ర‌భుత్వం దీనికి భిన్నంగా ప్ర‌జ‌లకు అందుబాటులో ఉండే వ్య‌వ‌స్థ తీసుకువ‌స్తామ‌ని చెబుతున్నది. ఈ మేర‌కు తాసిల్దార్ల‌కు, డిప్యూటీ క‌లెక్ట‌ర్లకు అధికారాల వికేంద్రీక‌ర‌ణ చేయాల‌న్న ఆలోచ‌న‌లో స‌ర్కారు ఉన్న‌ట్లు స‌మాచారం. గ్రామస్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ కూడా ఉండాల‌న్న తీరుగా స‌మాలోచ‌న‌లు చేస్తున్న స‌ర్కారు.. ఆ దిశ‌గా ముందుకు వెళ్ల‌డానికి అడ్డంకిగా ఉన్న ధ‌ర‌ణి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసే దిశ‌గా క‌సర‌స‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే ఈ విషయంలో ఫైల్‌ సిద్ధం చేయాలని అధికారుల‌కు ఆదేశాలు వెళ్లిన‌ట్లు స‌మాచారం.

Latest News