Gudimalkapur | పండుగ ఏదైనా.. పబ్బం ఎవరిదైనా.. ఘుమఘుమ వాసనలు వెదజల్లే మల్లెప్వువ్వులు( Jasmines ) కొనాలన్నా.. గుబాళీంచే గులాబీలు( Roses ) కొనాలన్నా.. కంటికి ముచ్చటగా కనిపించే ముద్దబంతి పువ్వులు( Marigold ) కొనాలన్నా.. అంతే కాదు.. ఏ పువ్వులు కొనాలన్నా.. ఠక్కున గుర్తొచ్చేది గుడిమల్కాపూర్ పూల మార్కెట్( Gudimalkapur Flower Market ). పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లో గుడిమల్కాపూర్ పూల మార్కెట్ జనాలతో కిక్కిరిసిపోతోంది. ఇక రాబోయే రోజుల్లో పండుగలు వరుసగా రానున్న నేపథ్యంలో గుడిమల్కాపూర్ పూల మార్కెట్ మరింత రద్దీగా మారనుంది.
ఈ పూల మార్కెట్ తెలంగాణ( Telangana )లోనే అతిపెద్ద పూల మార్కెట్. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ నుంచి ఒక్క తెలంగాణలోని జిల్లాలకే కాదు.. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు కూడా పూలు సరఫరా అవుతాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన గుడిమల్కాపూర్ పూల మార్కెట్ 2009లో ఏర్పాటైంది. కోఠిలోని జాంబాగ్ మార్కెట్( Jambagh Flower Market )ను గుడిమల్కాపూర్‌కు తరలించడంతో.. ఈ మార్కెట్‌కు గుడిమల్కాపూర్ మార్కెట్ అని పేరు వచ్చింది. ఇక ఈ పూల మార్కెట్ తెల్లవారుజామున 3, 4 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల వరకు పూల అమ్మకాలు ఓ రేంజ్‌లో కొనసాగుతాయి. ఇసుకెస్తే రాలనంతగా పూల విక్రయదారులు, కొనుగోలుదారులు పూల మార్కెట్‌లో నిండిపోతారు.
గుడిమల్కాపూర్ పూల మార్కెట్ రకరకాల, రంగు రంగుల పువ్వులతో ఎంతో రమణీయంగా ఉంటుంది. మల్లెపువ్వులు, కనకంబ్రాలు, గులాబీలు, బంతి పువ్వులు, లిల్లీ పువ్వులు, అలంకరణకు ఉపయోగించే వివిధ రకాల ఆకులు ఇతర పుష్పాలు అందర్నీ ఆకర్షిస్తాయి. ఆ పూల మార్కెట్‌లో తిరుగుతుంటే ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రావణమాసం, వరలక్ష్మి వ్రతం( Varalakshmi Vratam ), రాఖీ పండుగ( Rakhi Festival ), వినాయక చవితి( Vinayaka Chavithi ), దసరా( Dasara ), బతుకమ్మ( Bathukamma ), దీపావళి( Deepavali )తో పాటు కార్తీక మాసంలో గుడిమల్కాపూర్ పూల మార్కెట్ రద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్కెట్‌లో పూలు కొనుగోలు చేయాలంటే.. మార్నింగ్ 4 నుంచి 7.30 మధ్య అనువైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో తాజా పువ్వులు లభిస్తాయి. కొన్నిసార్లు రైతులతో నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.