అవినీతి.. అక్రమాలలో కూరుకుపోయిన మాజీ ఎమ్మెల్యే కిషోర్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పతనానికి ప్రధాన కారకుడు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అని.. జిల్లాలో అక్రమ ఇసుక దందాకు, అక్రమ వసూళ్లకు, అవినీతికి పాల్పడిన కిషోర్ వ్యవహారశైలి భరించలేక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో

  • Publish Date - April 25, 2024 / 01:40 PM IST

ఆయన వైఖరీతోనే జిల్లాలో బీఆరెస్ మునిగింది
బీఆరెస్ గుత్తా వర్గీయుల తీవ్ర ఆరోపణలు

విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పతనానికి ప్రధాన కారకుడు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అని.. జిల్లాలో అక్రమ ఇసుక దందాకు, అక్రమ వసూళ్లకు, అవినీతికి పాల్పడిన కిషోర్ వ్యవహారశైలి భరించలేక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు సహా పలువురు ఆ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులైన బీఆరెస్ నేతలు జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం , బీఆరెస్‌ పార్టీ సీనియర్ నేతలు ఐతగోని స్వామి గౌడ్ , అనీష్‌లు నిర్వహించిన మీడియా సమావేశంలో గాదరి కిషోర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి గాని, వయస్సు గాని లేని చిల్లర వ్యక్తి గాదరి కిషోర్ అని దుయ్యబట్టారు.

ఒక ఉపాధ్యాయుని కొడుకై ఉండి కనీసం వయసులో తన తండ్రి కన్నా పెద్దవారిని గౌరవించే కనీస సంస్కారం లేని నీచుడని తప్పుబట్టారు. ఉస్మానియా యూనివర్సిటిలో వేలాది మంది చేసిన ఉద్యమాలను ఆయనొక్కడే చేసినట్లు తన ఖాతాలో వేసుకొని, తన వెంట నడిచిన స్నేహితులను సైతం నిలువునా ముంచిన ఘనుడన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం పేరుతో రాజకీయ నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని విమర్శించారు.

ఉద్యమ కారుడినని చెప్పుకుని ఆ కోటాలో ఎంఎల్‌ఏ టికెట్ తెచ్చుకొని, రెండుసార్లు అత్తెసరు ఓట్లతో గెలిచి తుంగతుర్తి ప్రాంతానికి చేసింది ఏమి లేకపోగా, ముఠాలను పోషించి గ్రామాల్లో రాజకీయ వైషమ్యాలు రగిలించాడని ఆరోపించారు. ప్రజలకు కిషోర్ అవినీతి, అక్రమాల చరిత్ర అర్ధమై మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి తరిమికొట్టారన్నారు. అక్రమ ఇసుక దందాను వృత్తిగా మార్చుకొని వందల కోట్లు సంపాదించడంతో పాటు దొంగ నోట్ల కేసులు, భూ కబ్జాలు, బ్లాక్ మెయిల్ వ్యవహారాలు చేసి అడ్డగోలుగా సంపాదించి ప్రజాప్రతినిధి పదవికి కళంకం తెచ్చాడని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల యజమానులను బెదిరించి, పీడీఎస్ బియ్యం అమ్ముకుని కోట్లకు కోట్లు సంపాదించడన్నారు. అధికారులను వేధించి వసూళ్ళు చేసిండని ఆరోపించారు. ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి ,వాటి ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బినామిలా రైస్ మిల్లులకు పంపింది నిజం కాదా ? అని ప్రశ్నించారు.

దళిత బంధులోనూ అవినీతి

తుంగతుర్తి నియోజకవర్గంలో, తిరుమలగిరి మండలం దళిత బంధు పథకంలో తన బినామీలకు,అనుచరులకు ఇప్పించి కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవము కాదా అని నిలదీశారు. దళిత బిడ్డ అని చెప్పుకుంటూ నీ సామాజిక వర్గంలో ఉన్నవారిని కూడా ఎదగనీయకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులని బనాయిస్తూ రాజకీయ సామాజిక అణిచివేతకు పాల్పడిన దుర్మార్గుడని విమర్శించారు.

స్థానిక సంస్థల్లోని మహిళా ప్రజా ప్రతినిధులను, మహిళా కార్యకర్తల పట్ల అసభ్య ప్రవర్తన..వేధింపులకు పాల్పడిన చరిత్ర తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. మీకు అనుకూలమైన కలెక్టర్‌ను రంగారెడ్డి జిల్లాలో పెట్టుకొని కుంట్లూరు గ్రామా శివారులో భూ అక్రమ దందా చేసిన వ్యవహారంపై పత్రిక కథనాలు సైతం వెలువడ్డాయని, అక్రమ భూముల కొనుగోలులో కుటుంబ సభ్యులను విడదీసి వారి మరణాలకు కారణమై ఆ పాపాన్ని మూట కట్టుకున్న చరిత్ర నిజం కాదా అని ప్రశ్నించారు.

పార్టీల్లో పలు పదవులను అమ్ముకున్న ఘనత గాదర్ కిషోర్ కే వర్తిస్తుందన్నారు. ఒక సామాన్య, సాధారణ వ్యక్తి మందుల సామేల్‌ చేతిలో తుక్కు తుక్కుగా ప్రజలు ఓడించినప్పటికి సిగ్గురాలేదని, గాదరి కిషోర్ అవినీతి చిట్టా, చేసిన అక్రమ దందాలు వివరాలు, అవినీతి బాగోతం మొత్తం బయటపెడుతామని తెలిపారు. మరోసారి నీస్థాయి మరిచి చిన్నా, పెద్దా తేడా లేకుండా గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శిస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆరెస్ నేతలు వెంకటేశ్వర్ రావు, గోపాల్ రెడ్డి, యామ దయాకర్, హరికృష్ణ, మునాసు వెంకన్న, మాజీ జడ్పీటీసీ సంజీవ, చిల్కరాజు శ్రీనివాస్, బకారం వెంకన్న, పీఏసీఎస్‌ చైర్మన్ దోటి శ్రీనివాస్, చెన్నగోని యాదగిరి, మైనారిటీ బీఆరెస్ లీడర్స్ అనీష్ ముక్తాదర్, హన్ను తదితరులు పాల్గొన్నారు.

Latest News