విధాత : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోడ్ ముసుగులో గ్యారంటీల అమలును దాటవేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. అయితే మార్చి 17తో వందరోజులు పూర్తవుతాయని, ఫిబ్రవరి నెలాఖరులోపే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు.
ఈ నేపథ్యంలో కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతోన్నాయన్నారు. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదన్నారు. అటు శ్వేతపత్రాలు కూడా హామీల ఎగవేత పత్రాలా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఆరు గ్యారంటీల అమలముపై ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా ఫిబ్రవరి 20వ తేదీ లోపే చేయాలన్నారు. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని, పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యమవుతుందన్నారు.
యాసంగి పంటకూడా లోక్‌సభ ఎన్నికల సమయంలోనే వస్తున్నందున పంట బోనస్ చెల్లింపుపై హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. డిసెంబరు 9నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పించన్ల పెంపు, 200 యూనిట్లలోపు విద్యుత్ బకాయిల మాపీ అమలుచేస్తామని హామీ ఇచ్చినా.. ఇంకా అమలు కాలేదని మండిపడ్డారు. జిల్లాలకు వెళితే రైతులు తమకు రైతుబంధు రాలేదని వాపోతున్నారన్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే దాటవేత, ఎగవేత అన్నట్టుగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంచినట్టు చెప్పిన ప్రభుత్వం ఎంత మందికి వర్తింప చేసిందో వివరాలు చెప్పలేదన్నారు. అటు జాబ్ క్యాలెండర్‌కు కూడా మార్గదర్శకాలు వెల్లడించాలని, 2లక్షల ఉద్యోగాల హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.