విధాత : గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటివని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నూతన గ్రామ సర్పంచ్ ల అభినందన సభలో హరీష్ రావు మాట్లాడారు. అధికార పార్టీ సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో 80శాతం ఫలితాలు సాధించాలని, గతంలో బీఆర్ఎస్ ఆ స్థాయిలో విజయాలు సాధించిందన్నారు. కాని ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అడ్డగోలు వ్యవహరాలు చేసినా..అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 50శాతం విజయాలు మాత్రమే సాధించిన తీరు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పట్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే ధైర్యం చేయడన్నారు. పార్టీ సింబల్ తో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తు చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడన్న భయం రేవంత్ రెడ్డికి ఉందని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంకేతం అని హరీష్ రావు స్పష్టం చేశారు. రెండేళ్ల పిదప రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందన్నారు.
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు, 420హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన కాలంలో రైతులను మోసం చేస్తు ఇబ్బందుల పాలు చేస్తుందని టి.హరీష్ రావు విమర్శించారు.
యూరియా సరఫరా చేయడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం యాప్ లు, మ్యాప్ లు అంటూ దొంగ నాటకాలు ఆడుతుందన్నారు. రైతులు వ్యవసాయం చేయాలా యాప్ చుట్టూ, మ్యాప్ చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. రైతులకు కావాల్సింది యూరియా, నీళ్లు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌లు కావన్నారు. వాన కాలంలో యూరియా సరఫరా చేయలేకపోయిన కాంగ్రెస్, యాసంగిలో కూడా అదే పరిస్థితి తెచ్చేలా కనబడుతుందని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నాలుగు సార్లు రైతు భరోసా సహాయం అందించాల్సి ఉండగా..రెండు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఎగవేశాడని ఆరోపించారు. యాసంగి పంట సాగులో రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాల్సిన ప్రభుత్వం పంట వేసినోళ్లకే రైతు భరోసా అంటూ కప్పదాట్లు వేస్తుందని హరీష్ రావు విమర్శించారు.
ఆ రైతులకు రైతు భరోసా ఇవ్వారా?
యాసంగి రైతు భరోసాను పంటలు సాగు చేసినోళ్లకే ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి లీకులు ఇస్తున్నాడని, తెలంగాణలో 50 నుండి 60 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారని, పత్తి రైతులు ఒక పంటనే వేస్తారని, తోటలు, పప్పుదినుసులు, మొక్కలు, పసుపు, ఉల్లి, చెరుకు సాగు చేసే రైతులకు యాసంగి రైతు బంధు వేయరా? అని హరీష్ రావు నిలదీశారు.
రైతు రుణమాఫీ కూడా అందరికి అమలు కాలేదన్నారు. పంట బోనస్ 1800కోట్లు పెండింగ్ లో ఉందన్నారు. రైతు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిలైందని విమర్శించారు. మరోవైపు ఘనపురం రైతులు సాగు నీటి విడుదల జరుగుతుందో లేదో తెలియక అయోమయంలో ఉన్నారన్నారు. కౌలు రైతులకు కౌలు ఇచ్చినట్లు రాసిస్తే అప్పుడే యూరియా ఇస్తానని ప్రభుత్వం చెబుతుందని, దీంతో భూ యజమానులు కౌలు ఇవ్వడమే బంద్ చేస్తారని, దీనివల్ల లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
అందరికి యూరియా, పెట్టుబడి, రుణమాఫీ, బోనస్ ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యాప్ లు బంద్ చేసి రైతులందరికి యూరియా సరఫరా చేయాలని, రుణమాఫీ డబ్బులు అందరికి ఇవ్వాలని, వరి బోనస్ 1800కోట్లు విడుదల చేయాలని, యాసంగి పంట రైతు భరోసా డబ్బులను వెంటనే షరతులు, కోతలు లేకుండా తక్షణమే విడుదల చేయాలని, మెదక్ ఘనపురం ఆనకట్టు రైతులకు నీటి విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి :
State Election Commission : తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: ఈసీ
Bengaluru Cyber Crime : బెంగళూరు లో ప్రతిరోజు రూ.5.45 కోట్ల డిజిటల్ మోసం
