విధాత, హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 5గంటల నుంచి ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లుగా తెలిపింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ పేర్కొంది. ఎన్నికల విధుల్లో మరణించిన సిబ్బందికి పరిహారం చెల్లించాల్సి ఉందని, పరిహారం చెల్లింపుకు అవసరమైన చర్యలను జిల్లాల కలెక్టర్లు తీసుకోవాలని సూచించింది. కాగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు ఈ నెల 22న పదవీ స్వీకరణ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉప ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్ ను నవంబర్ 16న కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మోడల్ కోడ్ ను ఎత్తివేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
వరుస ఎన్నికలు..అభివృద్దికి కోడ్ బ్రేక్ లు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్లమెంటు ఎన్నికలు, అదే సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(మహాబూబ్ నగర్, హైదరాబాద్) ఎన్నికలు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, అనంతరం కరీంనగర్-మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అలాగే నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా వచ్చాచి. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలు కూడా జరిగిపోయాయి. ఇలా వరుస ఎన్నికల ప్రక్రియ కారణంగా పలుమార్లు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న పరిణామం అభివృద్ధి పనుల అమలుకు బ్రేక్ లా మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ముందున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రానుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Bengaluru Cyber Crime : బెంగళూరు లో ప్రతిరోజు రూ.5.45 కోట్ల డిజిటల్ మోసం
Gandipet reservoir| జంటనగరాల తాగునీటి జలాశయాలలోకి మానవ వ్యర్థాలు!
