విధాత : నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లపై తప్పుడు కేసులు బనాయించడాన్ని..మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలలో(Congress protest) హోరెత్తించారు. ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట విపక్షాల ఆందోళన చేపట్టాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఎంపీలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.
తెలంగాణలో బీజేపీ కార్యాలయాల ముట్టడి
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ అక్రమ కేసులను, ఉపాధి హామీ పథకం పేరుమార్పును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ కార్యాలయాల ముట్టడి(BJP office gherao)కి దిగాయి. భారీ ర్యాలీలలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, కరీంనగర్ బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించిన క్రమంలో బీజేపీ శ్రేణులు ప్రతిఘటనకు సిద్దమవ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను నియంత్రించాయి.
కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసులో విక్టరీ టు నేషనల్ హెరాల్డ్, విక్టరీ టు యంగ్ ఇండియా అంటూ పోస్టర్లు పట్టుకుని బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని పరిస్థితిని అదుపు చేశారు.
