ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిస్తేనే కాంగ్రెస్‌ దారికొస్తుంది: హరీశ్‌రావు

ఎన్నికల్లో అలవికాని హామీతో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబితేనే దారికొస్తుందని, హామీలను అమలు చేస్తుందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు

  • Publish Date - May 23, 2024 / 06:18 PM IST

హైదాబాద్‌ను యూటీ చేసేందుకు కుట్ర

విధాత : ఎన్నికల్లో అలవికాని హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబితేనే దారికొస్తుందని, హామీలను అమలు చేస్తుందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచార సభకు హాజరైన హరీశ్‌రావు బీఆరెస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకే హామీ అమలైందని,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన భృతి, జాబ్‌ క్యాలెండర్‌ ఊసు లేదన్నారు.

ఉపాధ్యాయ, ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో ఉపాధ్యాయులపై లాఠిచార్జీ చేసిందన్నారు. ఎన్నికలు అయిపోయాయి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచుతుందని ఆరోపించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగగొట్టిందని, రేపో మాపో కరెంటు బిల్లులు పెంచుతుందని, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెంచుతుంది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతుందని, ఈ కాంగ్రెస్ పాలన సంక్షేమ పథకాల్లో కోతలు, పేద ప్రజల మీద బిల్లులు, ధరలు పెంచి వాతలు అన్నట్టు ఉందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అదుపు చేసి హామీల అమలుకు ఒత్తిడి తేవాలంటే ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డిని గెలిపించాలన్నారు.

హైదాబాద్‌ను యూటీ చేసేందుకు కుట్ర

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా చేసే కుట్రలు జరుగుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2వ తేదీఓ ముగుస్తుందని..ఈ క్రమంలో కొందరు హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్ మనకు దక్కాలంటే తెలంగాణ ఒక్కటవ్వాలన్నారు. ఇలాంటి సమస్యల సమయంలో ప్రజలంతా బీరెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. గతంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయడంలో, లోయర్‌ సీలేరు పవర్‌ ఫ్లాంటును ఏపీకి అప్పగించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు సహకరించుకుంటే, బీఆరెస్‌ పోరాడిందని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ హక్కుల సాధనకు బీఆరెస్‌ను గెలిపించాల్సివుందన్నారు.

Latest News