Site icon vidhaatha

Telangana | ముసురేసింది..రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం

పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
మరో రెండు రోజులు భారీ వర్షాలు
లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి
ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం
గోదావరి వరదలపై సమీక్షించిన మంత్రి సీతక్క

విధాత: రాష్ట్రాన్ని ముసురు కమ్మేసింది. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంబీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాచలం, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. కాగా ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా మిగితా అన్ని జిల్లాల్లో ఒక తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఇలా తెలంగాణ అంతటా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

ఫలితంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ మవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి కే పెద్ద వాగు ప్రాజెక్ట్ కు గండి పడింది. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. మరో వైపు వాతావరణ శాఖ ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించింది. శనివారం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురువగా, 21వ తేదీన 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కేంద్రీకృతమైన వాయుగుండం

శుక్రవారం ఒడిశా ,ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయువ్య ,పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం ఒడిశా తీరంలోని తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నది. అలాగే రుతుపవన ద్రోణి జైసాల్మయిర్, అజ్మీర్, మాండ్ల, రాయిపూర్ నుంచి ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం మీదుగా వెళుతూ తూర్పు-మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నది. దీని ఫలితంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములు మెరుపులుతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

అందుబాటులో ఉండండి- నిఘా పెంచండి.. అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. శనివారం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరి వరదలపై మంత్రి సీతక్క సచివాలయంలో అధికారులో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ ఇంచార్జీ మంత్రిగా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడుతూ గోదావరి వరద పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాగులు ఉప్పేంగే ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచాలనీ కలెక్టర్లకు సూచించారు. గ‌త అనుభ‌వాల దృష్టిలో ఇప్పటికే ప్రభుత్వం ముంద‌స్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఇప్పటికే కంట్రోల్ రూం, పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు.

Exit mobile version