హుజూర్నగర్ లో అధికార పార్టీకి షాక్.. బీఆరెస్‌కు మున్సిపల్ చైర్మన్ రాజీనామా

సూర్యాపేట పరిధిలోని హుజూర్నగర్ నియోజకవర్గం లో నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీలత రెడ్డి పార్టీకి తన పదవులకు రాజీనామా

  • ఉత్తమ్‌ సమక్షంలో చేరిన చైర్మన్ ముగ్గురు కౌన్సిలర్లు
  • రేపు బిజెపికి చల్లా శ్రీలత రెడ్డి
  • బలహీనమవుతున్న సైదిరెడ్డి బలగం

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట పరిధిలోని హుజూర్నగర్ నియోజకవర్గం లో నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీలత రెడ్డి పార్టీకి తన పదవులకు రాజీనామా చేసి రెండు వారాలు గడవకముందే హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవితో పాటు మరికొందరు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి రాజీనామా చేశారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఎంతో సపోర్టుగా ఉన్న మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన ఆమె భర్త రవికుమార్లు ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంవత్సరంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు కౌన్సిలర్లు గాయత్రి గుంజా భవాని సతీష్ తో పాటు మరో 200 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు.


 




హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవరు బహిరంగంగా వ్యతిరేకించకపోయిన ఎన్నికల సమీపిస్తున్న వేళలో ఆ పార్టీలో ఉన్న అసంతృప్తివాదులు ఎమ్మెల్యే వైఖరికి అడ్డు చెప్పలేక కాంగ్రెస్ లోకి వలసలు వస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సైదిరెడ్డి చేస్తున్న అరాచకాలను వారు వ్యతిరేకిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని సైదిరెడ్డి తనకిష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా అడ్డు చెబితే అక్రమ కేసులు పెట్టడమే కాకుండా మానసికంగా ఇబ్బందులు పెడతారని ఆరోపణలు చేస్తున్నారు. భూ దందాలతో పాటు సెటిల్మెంట్లు విచ్చలవిడిగా చేసి కోట్లు సంపాదించారన్నారు.


బిజెపిలోకి శ్రీలత రెడ్డి..!


ఇటీవలే హుజూర్నగర్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి మంగళవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఆమె వెంట నేరేడుచర్ల తదితర ప్రాంతాల నుంచి 500 మంది ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.


బలహీనమవుతున్న సైదిరెడ్డి బలగం..


హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బలగం బలహీనమవుతుంది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యక్రమాలను విస్తృతపరచడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నారు. మరో రెండు రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు నిదర్శనమే పార్టీ ఫిరాయింపులని పేర్కొన్నారు. బెదిరింపులు అవినీతి అక్రమాలతో పరిపాలన కొనసాగదని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఊసే లేకుండా చేస్తానన్నారు.

Latest News