Telangana GCC growth | గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాల ఖిల్లా తెలంగాణ

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 2025లో 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది దేశంలో ఏర్పడిన 85 జీసీసీలలో 41 తెలంగాణలోనే వచ్చాయి.

Telangana GCC growth

హైదరాబాద్, విధాత ప్రతినిధి: Telangana GCC growth | గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. రానున్న మూడు సంవత్సరాల్లో తెలంగాణ జీసీసీ పవర్ హౌస్ గా అవతరించనున్నది. ఇవి పది రోజులకు ఒకటి చొప్పున ఏర్పాటు అవుతుండటం విశేషం. దేశవ్యాప్తంగా పోల్చితే 2025 సంవత్సరంలో 46 శాతం వృద్ధిని తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 85 జీసీసీలు ఏర్పాటు కాగా రాష్ట్రంలోనే 41 వరకు వచ్చాయి.

ప్రస్తుతం భారతదేశంలో 1,800 వరకు ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాటితో పోల్చితే ఇవి 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3,200 ఉంటే వాటిలో 1,700 వరకు భారత్ లోనే ఏర్పాటు అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జీసీసీలలో 19 లక్షల మంది నిపుణులు పనిచేశారు. ఎగుమతులు చేయడం ద్వారా 64.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి.

గ్లోబల్ కేపబిలిటి సెంటర్లు అంటే విదేశాలకు చెందిన బహుళ జాతి కంపెనీలు తమ సొంత యాజమన్యంలో వేరే దేశంలో ఏర్పాటు చేసుకునే కార్యాలయాలు అన్న మాట. తమ మాతృ సంస్థ కార్యాకలాపాలకు ముఖ్యమైన ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, రీసెర్చి, డేటా అనలిటిక్ లకు వ్యూహాత్మకంగా మద్ధతును అందిస్తాయి. ఇందుకు భారీ స్థాయిలో జెన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటి, క్లౌడ్, వర్చువల్ రియాల్టీ వినియోగిస్తున్నారు.

అయితే భారత దేశంలో జీసీసీల ఏర్పాటుకు అనువుగా హైదరాబాద్ తో పాటు బెంగళూర్ నగరాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. మానవ వనరుల లభ్యత, నిపుణులైన ఇంజినీర్లు అందుబాటులో ఉండడంతో ఈ రెండు నగరాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. అంతర్జాతీయ కంపెనీలు కొలువై ఉండడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఇందుకు కారణమని సాఫ్ట్ వేర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో మెక్ డొనాల్డ్స్, ఈ నెలలో సొనా టైప్ లు జీసీసీ లు ప్రారంభించాయి.

రాష్ట్రంలో వచ్చే ఏడాది లోపు కొత్తగా 120 జీసీసీ లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నది. వీటి ద్వారా 1.2 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్తగా ఉపాధి లభించనున్నది. హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు అయిన వాటిల్లో అమెరికా కేంద్రంగా ఉన్న ఆటోమోటివ్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, టెలికాం రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు ఉన్నాయి. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో 890, ఢిల్లీ 475, ముంబై 375, పూణే 370, హైదరాబాద్ లో 360, చెన్నైలో 310 వరకు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 160 ఏర్పాటు కాగా అందులో 64 హైదరాబాద్ లోనే ఏర్పాటు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ జీసీసీ లలో 3.1 లక్షల మంది నిపుణులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో 33 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

Latest News