భారీ వర్షాలు కురవడంతో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరద వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ప్రవహిస్తున్నందున ముందు జాగ్రత్తగా సర్వీస్ రోడ్డుపై పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ ను మూసివేశారు. మరో వైపు మూసీ ఉధృతితో మంచిరేవుల, నార్సింగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మకల్ పేట ముసారాం బాగ్ వద్ద పాత బ్రిడ్జిని తాకుతూ మూసీ ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూసీలో వరద ఎక్కువగా వస్తున్నందన జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.మూసీ వరద ఉధృతితో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం సంగెం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి వరద పోటెత్తింది. దీంతో వలిగొండ నుంచి పోచంపల్లి, చౌటుప్పల్ నుంచి వలిగొండ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు. ప్రస్తుతం మూసీ 643 అడుగులకు చేరింది. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 4.46 టీఎంసీలు, ప్రస్తుతం 4.09 టీఎంసీలకు చేరింది.
Telangana : ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు పోటెత్తిన వరద: మూసీలో వరద ఉధృతి
