విధాత, హైదరాబాద్ : ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. భక్తుల బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు, మొక్కుల చెల్లింపులతో ఆలయాలు కిటకిటలాడాయి. నగరం అంతటా అమ్మవారి చిన్నా, పెద్ద ఆలయాల్లో బోనాల పండుగను స్థానికంగా ఉండే ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ కమిటీ, ఎండోమెంట్ అధికారులు భట్టికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క బోనాలు భూమి పుత్రుల పండగ అని.. బోనాల పండగ ఘనంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఈ నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు సామర్యంగా జీవిస్తున్న గొప్ప నగరం హైదరాబాద్ అని, ఈ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
అత్యంత భద్రతాపూరిత నగరంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం లక్ష్యం అన్నారు. చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. లాల్ ధర్వజా అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భాగ్యనగర్ అమ్మవారి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దంపతులు బోనం, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎంపీ ఎన్నికల్లో సగం స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కని బీఆరెస్ గూర్చి పండుగ పూట మాట్లాడటం అనవసరమన్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్న కేటీఆర్ ఆరోపణలు హాస్యాస్పదమని, కుట్రలు చేస్తే డ్యామ్ భూమిలోపలికి పోతుందా అని ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకే మేడిగడ్డపై ముందుకెలుతామన్నారు. ఒల్డ్ సిటీని న్యూ సీటిగా మా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని, మెట్రో వసతి కల్పించబోతుందన్నారు. నల్ల పోచమ్మ దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మేయర్ గద్వాల విజయలక్ష్మి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబర్‌పేటలోని మహంకాళీ అమ్మవారిని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.