హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ అర్బిట్రేషన్‌ సెంటర్‌

సీజేఐగా కల సాకారానికి కృషిఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనసింగపూర్‌ సుప్రీంకోర్టు సీజేకు ప్రతిపాదనఆగస్టులో సమావేశం జరగవచ్చుఆ తర్వాత హైదరాబాద్‌లో పర్యటనత్వరలో ఏర్పాటుకు ప్రయత్నాలుసీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ వెల్లడి విధాత:పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిష్కారాల కోసం ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను (మధ్యవర్తిత్వ కేంద్రం) హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. సింగపూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ తరహాలోనే హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు […]

  • Publish Date - June 17, 2021 / 12:15 PM IST

సీజేఐగా కల సాకారానికి కృషి
ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదన
సింగపూర్‌ సుప్రీంకోర్టు సీజేకు ప్రతిపాదన
ఆగస్టులో సమావేశం జరగవచ్చు
ఆ తర్వాత హైదరాబాద్‌లో పర్యటన
త్వరలో ఏర్పాటుకు ప్రయత్నాలు
సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ వెల్లడి

విధాత:పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిష్కారాల కోసం ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను (మధ్యవర్తిత్వ కేంద్రం) హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. సింగపూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ తరహాలోనే హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ మీనన్‌ను కోరినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళితే ఆయన సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న తన కల సాకారం అవుతుందని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్బిట్రేషన్‌ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ అధికారి ఉంటారని చెప్పారు. మంగళవారం రాజ్‌భవన్‌ అతిథి గృహంలో హైకోర్టు లీగల్‌ రిపోర్టర్లతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

అంతర్జాయతీ స్థాయి కంపెనీలు (ఎంఎన్‌సి) ఏర్పాటు కావడం ఒక ఎత్తు, వాటిలో తలెత్తే వివాదాలు సత్వర పరిష్కారం మరొక ఎత్తని, వివాదాలు వెంటనే పరిష్కారమైతేనే పలు ఎంఎన్‌సి సంస్థలు దేశంలో ప్రధానంగా ఉన్నత ప్రమాణాలున్న హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని చెప్పారు. ఇలాంటి వివాదాలను సింగపూర్‌లోని ఇంటర్నేషన్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో పరిష్కారానికి ఎంఎన్‌సి సంస్థలు వెళుతున్నాయని వివరించారు.

అక్కడికి వెళ్లేందుకు భారీ మొత్తంలో న్యాయవాదులకు ఫీజులు, వాళ్లు ప్రయాణ ఖర్చులు, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న హోటల్స్‌లో బస వంటివి ఖర్చు అవుతున్నాయని, అదే ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే అవన్నీ ఇక్కడకే వస్తాయని తెలిపారు.
ప్రపంచ దేశాల్లోని అనేక కోర్టుల్లో లేని ఐటీ సాంకేతికత మన సుప్రీంకోర్టులో వినియోగంలో ఉందని, కేసుల సత్వర పరిష్కారానికి వినియోగిస్తున్న ఆర్టిఫియల్‌ ఇంటిల్‌జెన్సీ సాఫ్ట్‌వేర్‌ కావాలని సింగపూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మీనన్‌ కోరారని, ఈ సమయంలో హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన చేసినట్లు, జస్టిస్‌ మీనన్‌ ఆగస్ట్‌లో భారత్‌కు రానున్నారని, అప్పుడు ఆయనతో చర్చించి ఫలితం సానుకూలంగా వచ్చే కృషి చేస్తానన్నారు. ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందనే ఆశాభావాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన అంశం గురించి సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఎంతో అవసరమన్నారు. సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో ఉన్నత ప్రమాణాలతో కూడిన మౌలిక వసతల కల్పన కీలకమన్నారు. ఇంటర్నేషన్‌ లా కేసుల్ని వాదించే న్యాయవాదులు వస్తే హైదరాబాద్‌లో బస చేసేందుకు అన్ని వసతులతో కూడిన హోటల్స్‌ ఉండనే ఉన్నాయని తెలిపారు. ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలంటే దానిపై అప్పీల్‌ చేసేందుకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సివుందని చెప్పారు.

ఇప్పటికే హైదరాబాద్‌ నగరం ఐటీ, ఫార్మా రంగాల్లో అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తోందని, వీటికి చెందిన గణాంకాలు కూడా చూస్తే ఎంతో వృద్ధిలో ఉన్నాయని, అలాంటి ఎంఎన్‌సి కంపెనీల విదాదాలు ఎంత త్వరగా పరిష్కారమైతే అంతే వేగంగా హైదరాబాద్‌లో పలు చోట్ల ఎంఎన్‌æసి కంపెనీలు కొత్తగా ఏర్పాటుకు ముందుకు వస్తాయని చెప్పారు. ఈ నిర్ణయం అమలుల్లోకి భౌగోళికంగా ఎంతో అనుకూలంగా ఉన్న హైదరాబాద్‌లో ఎంఎన్‌సి సంస్థలు ఏర్పాటుకు వీలౌతుందన్నారు. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటి ఎంఎల్‌సిల్లో న్యాయ వివాదం తలెత్తితే ఆర్బిట్రేషన్‌ ద్వారా వెంట వెంటనే పరిష్కారం కావాలని ఆ సంస్థలు కోరుకుంటాయని తెలిపారు.

ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ న్యాయ వివాదం ఏర్పడితే ఎన్నాళ్లలోగా అవి పరిష్కారం అవుతాయో ఆరా తీస్తున్నాయని, ఇటాంటి పరిస్థితులను బేరీజు వేసిన తర్వాతే ఐటీ, ఫార్మా, ఇండస్ట్రీస్‌ వంటి ఎంఎన్‌సి సంస్థల వివాదాలకు సత్వరమే ముగింపు పలకాలనే యోచనే హైదరాబాద్‌లో ఇంటర్నేషన్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన అని జస్టిస్‌ ఎన్వీ రమణ వివరించారు. తాను కంటున్న కల సీజేఐ హోదాలో సారం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.

లైవ్‌ ఇస్తే బాగానే ఉంటుంది..
తీర్పుల ప్రతులు సుప్రీంకోర్టు తరహాలో అన్ని హైకోర్టుల్లోనూ వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసే అంశంపైన కూడా కసరత్తు జరుగుతోందని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. ఇందుకు సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేస్తున్నామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. దీని వల్ల తీర్పు కాపీ అందలేదని చెప్పి జాప్యం చేయడానికి వీలుండదని తెలిపారు. అంతేకాకుండా వాదప్రతివాదులకు ఇ–మెయిల్‌ ద్వారా తీర్పు కాపీ పంపేందుకు వీలౌతుందని, తీర్పు ప్రతిని వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంటుందని జస్టిస్‌ ఎన్వీ రమణ వివరించారు. కర్ణాటక, గుజరాత్‌ హైకోర్టులు విచారణను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని, కేసుల అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజాహిత వ్యాజ్యాలు వంటివి ప్రత్యక్ష ప్రసారం చేస్తే ప్రతిపాదన ఉందన్నారు.