Site icon vidhaatha

విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వద్దా? రాష్ట్ర వర్సిటీల్లో నిషేధం ఎందుకు?

హైదరాబాద్, ఆగస్ట్‌ 26 (విధాత): చదువుతో పాటు పోరాటం నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సదస్సులో నిక్కచ్చిగా మాట్లాడారు. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే అది ఉస్మానియా యూనివర్సిటీయేనని అన్నారు. ఓయూ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే సిద్ధించేది కాదని కూడా వ్యాఖ్యానించారు. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో రాజకీయ సైద్ధాంతిక పునాదులేసే వేదిక. ఇలాంటి వేదిక నుంచి ఇంత చైతన్యభరిత మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి.. తమ పార్టీ పాలనలోనైనా విద్యార్థి దశ నుంచే రాజకీయ చైతన్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటారా? విద్యార్థి సంఘ ఎన్నికలను పునరుద్ధరిస్తారా? అనే చర్చలు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం హయాం నుంచీ గత 37 సంవత్సరాలుగా రాష్ట్ర యూనివర్సిటీల్లో, అటానమస్ కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1988లో నిషేధించారు. నిజానికి ఇప్పుడు ప్రధాన రాజకీయ స్రవంతిలో ఉన్న అనేకమంది నాయకులు విద్యార్థి సంఘాల నుంచి వచ్చినవారే. విద్యార్థి రాజకీయాల్లో పాల్గొన్నవారు, విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాలుపంచుకున్నవారే. రేవంత్‌రెడ్డి సైతం విద్యార్థి నాయకుడిగానే ఎదిగారు. అటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థి సంఘ ఎన్నికలపై నిషేధం ఎత్తివేసి రాజకీయ చైతన్యానికి పునాది వేసి రాష్ట్రానికి, దేశానికి విద్యార్థి నాయకులను అందించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.

సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ చదువుతో పాటు పోరాటం నేర్పించే గడ్డ ఇది అన్నారు. డిసెంబర్ 9వ తేదీన మళ్లీ ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్‌కు వస్తానని, మీరు చెప్పే సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆ సమయంలో తనకు పోలీసుల బందోబస్తు అవసరం లేదని చెబుతూ.. ఆ మేరకు వేదిక మీద నుంచే డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు నిరసనలు తెలిపినా తానేమీ అనబోనని, నిరసన తెలిపే హక్కు వారికుందన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రులు శివరాజ్ పాటిల్, ఎస్.జైపాల్ రెడ్డి, విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి, ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉస్మానియా బిడ్డలేనన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.

ఎన్నికలు నిర్వహించాలి
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కుమార్ మొలుగారం బాధ్యతలు స్వీకరించిన తరువాత 1978 నుంచి 1988 మధ్య విద్యార్థి సంఘాల నాయకులుగా ఉన్న పూర్వ విద్యార్థులు ఆయనను ఈ ఏడాది జనవరిలో కలిసి అభినందించారు. ఉస్మానియాలో విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై ఉన్న నిషేధం ఎత్తివేసి, ఉన్నత విద్యలో ప్రజాస్వామ్య విలువలు పాదుకొల్పాలని కోరారు. తాము ఈ విశ్వ విద్యాలయంలోనే చదువుకున్నామని, రాజకీయంగా చైతన్యవంతులం అయ్యామని, అందుకు కారణం విద్యార్థి సంఘాల ఎన్నికలేనని వైస్ చాన్స్‌లర్‌కు పూర్వ విద్యార్థులు వివరించారు.

నిషేధం ఎత్తేయాలి… యూజీసీ ఆదేశాలు
తెలంగాణలోని విశ్వ విద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడో లేఖ రాసింది. మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో కమిటీ సిఫారసుల ప్రకారం స్టేట్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీల్లో విద్యార్థి సంఘాల ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని, ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న అన్ని యూనివర్సిటీలు, స్వయం ప్రతిపత్తి కాలేజీలకు లేఖలు పంపించారు. దీనిపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని కోరింది. లింగ్డో కమిటీ సిఫారసులు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ లేఖలు 2015 సంవత్సరంలో రాగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చెత్తబుట్టలో పడేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉస్మానియా నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఎందరో బలిదానాలకు కారణమైన బీఆర్ఎస్ ఆ తరువాత రాష్ట్రంలో రెండు దఫాలు అధికారంలో ఉంది. అయినా ఉస్మానియాతో పాటు మిగతా యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రాజకీయ చైతన్యానికి గట్టి పునాదులు వేయాలన్న ఆలోచన చేయలేకపోయింది. ఎన్నికలు నిర్వహించాలంటూ అప్పుడప్పుడు విద్యార్థి సంఘాలు వైస్ చాన్స్‌లర్‌కు వినతులు ఇస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది.

ఉస్మానియా పక్కనే ఉన్న వర్సిటీలో ఎన్నికలు
ఉస్మానియా యూనివర్సిటీ ఆనుకుని ఉన్న ఇంగ్లిష్‌ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఎన్నికల సందర్భంగా అక్కడ కోలాహలం కన్పిస్తుంది. ఇక్కడే కాకుండా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కూడా ఏటా గుర్తింపు విద్యార్థి సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికైన విద్యార్థి సంఘం నాయకులు తమకు ఏమి కావాలి? యూనివర్సిటీ లో మౌలిక వసతుల కల్పన, విధానాల రూపకల్పన తదితర అంశాలపై వైస్ చాన్స్‌లర్‌ లేదా రిజిస్ట్రార్‌ను కలిసి చర్చిస్తారు. ఎప్పటికప్పుడు వినతి పత్రాలు అందచేసి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను వెలిబుచ్చుతారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.

17 స్టేట్ యూనివర్సిటీలు
తెలంగాణలో 17 స్టేట్ యూనివర్సిటీలు, మూడు సెంట్రల్ యూనివర్సిటీలు, మరో మూడు డీమ్డ్ యూనివర్సిటీలు, 5 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వర్సిటీల్లో కూడా విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

వర్సిటీలలో ఎన్నిక‌లు నిర్వ‌హించాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల‌కు రాజ‌కీయ చైత‌న్యం కావాల‌ని ఉస్మానియా యూనివ‌ర్సిటీ వేదిక‌గా చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా యూనివర్సిటీలలో విద్యార్థి సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగారాజు డిమాండ్ చేశారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జెఎం లింగ్డో క‌మిటీ చెప్పిన విధంగా రాష్ట్రంలోని స్టేట్ యూనివ‌ర్సిటీల‌తో పాటు అన్ని విద్యాసంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరారు. కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం స్కూళ్ల‌లో స్కూల్ పార్ల‌మెంటు ఎన్నిక‌లు జరుపుతోందని, అదే విధంగా ఇక్క‌డ కూడా స్కూళ్ల‌కు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నాగరాజు డిమాండ్ చేశారు.

Exit mobile version