విధాత, హైదరాబాద్ : నేను గుంటూరులో..అమెరికాలో చదువలేదని..నాకు గూడు పుఠాణి తెలియదని..గుండెల నిండా అభిమానం నింపుకుని ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)కి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రభుత్వ బడిలో చదువుకున్నాడని..గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడని..పరిపాలన చేతకాదని తనపై రాజకీయ ప్రత్యర్థులు చేసిన విమర్శలను ఉస్మానియా వేదికగా తిప్పికొట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1000కోట్ల(1000 crore OU project)తో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం అన్నారు. గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చానని..ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాల్లో చదివినోళ్లకు బెంజీకార్లలో తిరిగే వారికి పేదరికం ఓ ఎగ్జిబిషన్ గా ఉండవచ్చని..కాని నల్లమల నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు పేదరికం ఏమిటో తెలుసని.. నాకు విదేశీ భాష గొప్పగా రాకపోవచ్చని..ప్రజల మనసు తెలుసుకునే విద్య తెలుసన్నారు. పేదవాళ్లు, పేద విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తారో నాకు తెలుసని స్పష్టం చేశారు.
వాళ్ల లెక్క దొంగను కాదు…చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తా
చేతనైతే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాలని ప్రతిపక్ష నాయకులు సవాల్ విసిరారని..నేను వాళ్ల లెక్క దొంగను కాదు…ఫామ్ హౌస్ లు కట్టుకోలేదని, గడీలు నిర్మించుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాశీర్వాదంతో తాను 2006ను జిల్లా పరిషత్ రాజకీయ ప్రయాణం ప్రారంభించి సీఎం స్థాయికి చేరుకుని..మీ సోదరుడిగా ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడ్డానన్నారు. చరిత్రలో నిలిచే మంచిపనులు నేను చేయదలుచుకున్నానన్నారు. కొంతమంది రెండేళ్లుగా ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారని, వాళ్లు 10ఎకరాల్లో ప్రగతి భవన్ గడీ, 26ఎకరాల్లో కోట్లాది రూపాయలతో సచివాలయం, ఆలుమగలు ఏం మాట్లాడుకున్నా వినేందుకు కమాండ్ కంట్రోల్ కట్టామని, లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టామని చెబుతుంటారన్నారు. నేను కూడా నాలుగు పనులు చేశానని వారు తొక్కిపెట్టిన అందేశ్రీ తెలంగాణ జయజయహే గీతాన్ని అందరు పాడుకునేలా..ప్రతి బడిలో వినిపించేలా చేశానన్నారు. బహుజనుల తెలంగాణ తల్లిని అధికారికంగా ఆవిష్కరించామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేశామన్నారు. కుల గణన పూర్తి చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జనగణనలో కులగణను చేర్చేలా చేశామన్నారు. అంబేద్కర్ స్పూర్తితో మా పాలన కొనసాగుతుందన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు..సంక్షేమంతోనే అభివృద్ధి అని తెలిపారు. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు అని..ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారన్నారు. వాళ్లను నేను ఒక్కటే అడగదలచుకున్నానని..వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నోళ్లు పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు అని గుర్తు చేశారు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు .. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనానికి కారణమన్నారు.
పదేళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం
తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది, ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదు అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైందని గుర్తు చేశారు. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగింది అన్నారు. మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని, తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదు అన్నారు. మా తమ్ముల్లు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారు అన్నారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం అని స్పష్టం చేశారు. పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు అని ఆరోపించారు.
నాణ్యమైన విద్య అందించేందుకు ప్రాధాన్యత
విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుందని, ఇప్పుడు విద్య అందుబాటులో ఉంది.. కానీ నాణ్యమైన విద్య కావాలని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది.. జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని స్పష్టం చేశారు. కులవివక్షను రూపుమాపి కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం అని, ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్ గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం అన్నారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు. గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం అన్నారు. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు అని, పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన అన్నారు.
రూ.1000కోట్లతో అంతర్జాతీయ స్థాయికి ఉస్మానియా
అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ అభివృద్దికి పెట్టే ఖర్చు భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నానని తెలిపారు. అందుకే తెలంగాణ స్టార్టప్ కోసం ఈ రోజు రూ.1000కోట్ల స్టార్టప్ ఫండ్ కేటాయించనన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు అని, ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు అన్నారు. మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం అని తెలిపారు. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదు అన్నారు. పిల్లల భవిష్యత్ ను చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ అని, పిల్లల భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్ మెంట్ ఉన్న వారిని నియమించుకొండని తెలిపారు. అందులో రాజకీయాలు, పైరవీలను ప్రోత్సహించేది లేదన్నారు. విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దన్నారు. కోట్లాడటంలో తప్పులేదని..నేను వద్దనని..ఎందుకంటే పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. విద్యార్ధులు నిబద్ధతతో నిరంతరం కష్టపడండి…భవిష్యత్తు నిర్మించుకోండి.. తప్పకుండా ఫలితం వస్తుందని సూచించారు. మీరంతా డాక్టర్లు, లాయర్లు, ఉన్నతాధికారులు కావాలన్నారు. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
