బీఆరెస్‌కు ద్వితీయ శ్రేణి దూరం!
అసమ్మతి నేతల దారీ గాంధీభవన్‌కే
మంత్రులకూ అడిగితేనే చప్పట్లు
తెలంగాణలో గాలి మార్పు సంకేతాలు
కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయలేం
ఎలాంటి స్థితినైనా అనుకూలంగా మల్చుకోగల నేత
రాష్ట్ర రాజకీయాలపై పరిశీలకులు అంచనాలు
విధాత న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలో రాజకీయ గాలి ఎటు వీస్తున్నది? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఏ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తున్నది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నది? ఈ విషయాలను అంచనా వేయాలంటే.. ఎన్నికలు దగ్గరపడే నాయకులు మారే పార్టీలు, క్షేత్రస్థాయిలో చర్చలు, రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో ప్రజల స్పందన వంటి అంశాలను పరిశీలించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
షెడ్యూలుకు ముందే మొదలైన చేరికలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ నియోజక వర్గాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల నుంచి మొదలు కొని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు పార్టీలు మారారు. ఇంకా అనేక మంది నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇలా పార్టీలు మారుతున్న నేతలు ఎక్కువ మంది ఏ పార్టీలో చేరుతున్నారో పరిశీలిస్తే ఆ రాజకీయ పార్టీకే బలం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలానేతలు పార్టీలు మారడం అనేది మారుతున్న రాజకీయ పరిస్థితులకు సంకేతమని చెపుతున్నారు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అధికార బీఆరెస్ నుంచి నేతలు కాంగ్రెస్‌లో చేరడాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుందని అంటున్నారు.
ఊతమిచ్చిన బీఆరెస్-బీజేపీ బంధం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో పెద్దగా వలసలు లేవని, దీంతో కాంగ్రెస్, బీఆరెస్, టీడీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగిందని రాజకీయ పండితులు చెపుతున్నారు. ఆనాడు ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణంతో బీఆరెస్ 63 సీట్లు గెలిచి, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 21, టీడీపీ 15, ఎంఐఎం 7 సీట్లలో గెలిచింది. బీఎస్పీ 2, సీపీఐ, సీపీఎం 2 సీట్లలో గెలిచాయి. అయితే పూర్తి స్థాయి మెజార్టీకి 3 సీట్లు మాత్రమే ఎక్కువగా గెలిచి, అధికారంలోకి వచ్చిన బీఆరెస్.. ఆనాడు రాజకీయ పునరేకీకరణ పేరుతో బీఎస్పీ, టీడీపీలను విలీనం చేసుకున్నది. సీపీఐకి ఉన్న ఒక్క సభ్యుడిని కూడా పార్టీలోకి తీసుకున్నది.
ఇలా 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత తన బలాన్ని బీఆరెస్ అమాంతంగా పెంచుకున్నది. అయితే టీడీపీని విలీనం చేసుకోవడంపై తెలంగాణ సమాజం పెద్దగా స్పందించలేదు. ఒక రకంగా ఆమోదం కూడా తెలిపింది. అంతటితో ఆగకుండా బీఆరెస్ 2018 ఎన్నికల తరువాత సీఎల్‌పీని కూడా విలీనం చేసుకున్నది. ఇలా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న చర్చ కూడా జరిగింది. దీంతో బీఆరెస్ అధినేతను విభేదించే కాంగ్రెస్‌లోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ స్థానంలో బీజేపీ బలపడుతున్నదనే చర్చ కూడా రాజకీయ వర్గాలలో బలంగా జరిగింది. అయితే కారణం ఏమిటనేది పక్కన పెడితే ఢిల్లీ స్థాయిలో బీఆరెస్, బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం క్రమంగా బలపడుతూ వచ్చింది. బీఆరెస్, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న అభిప్రాయం ఎప్పడైతే బలపడిందో ఆ వెంటనే బీజేపీ రాష్ట్రంలో బలహీన పడుతూ వచ్చింది. అప్పటి వరకు బీజేపీ వైపు చూసిన నేతలు ముఖం చాటేశారు. పూర్తిగా కనుమరుగైందనుకున్న కాంగ్రెస్ లేచి నిలబడింది.
తీరు మార్చేసిన కర్ణాటక ఫలితం
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో జోష్‌పెంచింది. ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఆ పరిణామాల తర్వాత కాంగ్రెస్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాజాగా బీఆరెస్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ దంపతులు, పలువురు మాజీ ఎమ్మెల్సీలు, కింది స్థాయిలో జెడ్‌పీ చైర్మన్లు, జెడ్పీ టీసీ, ఎంపీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు. కొంత మంది బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆరెస్ పార్టీ నేత ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ప్రత్యేకించి బీఆరెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం, టికెట్ ఆశించకపోయినా.. తమకు నచ్చనివారికి టికెట్ ఇచ్చారన్న కారణంతో కాంగ్రెస్‌లో చేరుతుండటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రజా బలమున్న నేతలు వేయి మందికిపైగా పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. అదే సమయంలో స్వల్ప సంఖ్యలో కాంగ్రస్‌లో టికెట్ దక్కని నేతలు బీఆరెస్‌లో చేరారు. అయితే ఈ పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్‌లో పెద్ద సంఖ్యలో చేరుతున్నతీరును పరిశీలిస్తే రాష్ట్రంలో గాలి ఎటు వీస్తున్నదో అర్థం అవుతుందని ఒక రాజకీయ పరిశీలకుడన్నారు.
టికెట్‌తో సంబంధం లేకుండా చేరికలు
ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలే ఉన్నారు కానీ, కాంగ్రెస్ నుంచి బీఆరెస్‌లోకి వచ్చిన నేతలు లేరని స్థానికుడొకరు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆరెస్‌లో చేరగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
అయితే చాలా మంది నాయకులు టికెట్‌తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటాన్ని ఒక సానుకూల సంకేతంగా చూడాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా మంది నేతలు పదవులతో సంబంధం లేకుండా బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఒక ఎమ్మెల్సీ, జెడ్‌పీ చైర్మన్‌తో పాటు ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా సీనియర్ నేతలే కాంగ్రెస్‌లో చేరారు.
ప్రతి రోజు ఈ జిల్లాలోని ఏదో ఒక గ్రామం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరుతూనే ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నిజామాబాద్, అదిలా బాద్ జిల్లాల నేతలు చెపుతున్నారు. ఈ రెండు నెలల్లో కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్నది.
పరిస్థితిని చాటుతున్న సభల్లో స్పందనలు
ఒక వైపు చేరికల పరిస్థితి ఇలా ఉండగా అధికార బీఆరెస్ సభలు, కాంగ్రెస్ సభలను పరిశీలిస్తే నేతలు మాట్లాడే సమయంలో ప్రజల నుంచి వచ్చే స్పందనలోనూ తేడా కనిపిస్తున్నదని అంటున్నారు. రెండు పార్టీల సభలకు జనం వస్తున్నా… బీఆరెస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లు వేదికపై నుంచి మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో తేడా ఉందని, అదే కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో చాలా వ్యత్యాసం ఉందని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు.
కాంగ్రెస్ నేతలు మాట్లాడేటప్పడు సభకు హాజరైన జనం నుంచి చప్పట్లు, హర్షద్వానాలు స్వచ్ఛందంగా వస్తున్నాయని, అదే బీఆరెస్ నేతలు మాట్లాడుతుండగానే సభ మధ్యలోనుంచే జనం వెళ్లి పోతున్నారని చెపుతున్నారు. పైగా ఒకటి రెండు సార్లు వేదికపైనుంచి అధినేత అడిగితే మొక్కుబడిగా స్పందిస్తున్నారని అంటున్నారు.
ఇలా సభలలో వచ్చే స్పందనను పరిశీలించినా, పార్టీలో చేరుతున్న తీరును చూసినా గాలి పయనం ఎటు వైపు ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఎంతటి గాలిని ఆపే శక్తిమంతుడు కేసీఆర్ అని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బెగ్.. బారో.. స్టీల్ అన్నట్లుగా ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో కేసీఆర్ శక్తి, సామర్థ్యాలను ఎవరూ తక్కువ అంచనా వేయలేరని తేల్చిచెబుతున్నారు.