Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubilee Hills By Poll )ఫలితం కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తుంది. మూడు సార్లు వరుసగా గెలుపు సాధించిన మాగంటి గోపీనాథ్( Magnati Gopinath ) కుటుంబం మళ్లీ జూబ్లీహిల్స్‌లో పాగా వేసేనా..? లేదంటే స్థానికుడైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్( Naveen Yadav ) గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేనా..? అనే విషయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగనుంది.
ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంది. అయితే గత మెజార్టీ బద్దలయ్యేనా..? అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపినాథ్.. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో ఈ మెజార్టీ క్రాస్ అయ్యేనా..? అంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో గోపీనాథ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాగంటి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్‌కు 80 వేల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఆయన భార్య సునీతకు ఎన్ని ఓట్లు పోలయ్యాయనే అంశంపై ఉత్కంఠ ఉంది.
ఇక కాంగ్రెస్ నేత అజారుద్దీన్ 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. 64,212 ఓట్లతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25 వేల ఓట్లు వచ్చాయి. అజారుద్దీన్ రెండో స్థానంలో, దీపక్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. అయితే అజారుద్దీన్ ఓటమి పాలైనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు ఆయనకు మంత్రి పదవి వరించింది.
నవీన్ యాదవ్ నేపథ్యం ఇదీ..
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చున్న నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట ఆయన మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. ఆ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడు. 2014లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం తరపున పోటీ చేశాడు. కానీ టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 9,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 18,800 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 2023 ఎన్నికల సమయంలో కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అయితే ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరమని మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ సూచించడంతో నామినేషన్‌ను వెనక్కి తీసుకొని.. నవంబర్ 15న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన “నవ యువ నిర్మాణ్” అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతూ యువతకు ఉపాధి శిక్షణ, ప్రోత్సాహం కల్పిస్తున్నాడు.
