Site icon vidhaatha

నేడు కాంగ్రెస్‌లోకి కేకే.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న కేకే

విధాత, హైదరాబాద్: బీఆరెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు కే.కేశవరావు బుధవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. కేకే తన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మే నెలలోనే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో లాంఛనంగా చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే జాతీయ నాయకుల సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరే ప్రక్రియలో భాగంగా నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

అయితే బీఆరెస్ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తుంది. బీఆరెస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేకే, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆరెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని భావించడంతో పాటు పార్టీలో ప్రజాస్వామిక వాతావరణం లేదని, కేసీఆర్‌ను కలవడం కూడా అసాధ్యంగా మారిందన్న అసంతృప్తిని కేకే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి తన సొంత గూటికి చేరుకోవాలని నిర్ణయించుకుని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తన రాజకీయ జీవితం చివరి రోజులను కాంగ్రెస్ పార్టీలోనే గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Exit mobile version