కాళేశ్వరం..విద్యుత్తు కొనుగోళ్లలో కేసీఆర్‌ తప్పులను బయపెడుతాం .. హుజూర్‌నగర్‌లో మంత్రిఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన అక్రమాలతో పాటు విద్యుత్తు కొనుగోలు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాల్లో చేసిన అవకతవకలను బయటపెడుతామని రాష్ట్ర ఇరిగేషన్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమర్‌రెడ్డి స్పష్టం చేశారు

  • Publish Date - June 19, 2024 / 06:45 PM IST

విధాత, హైదరాబాద్‌ : కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన అక్రమాలతో పాటు విద్యుత్తు కొనుగోలు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాల్లో చేసిన అవకతవకలను బయటపెడుతామని రాష్ట్ర ఇరిగేషన్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను కమిషన్ల కోసం రీడిజైన్లు చేసి ఇరిగేషన్‌ రంగాన్నికేసీఆర్‌ నాశనం చేశారని, విద్యుత్తు సంస్థలను సైతం తన అసంబద్ధ నిర్ణయాలతో అప్పుల పాలు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఖజనాకు గుదిబండగా మారిందన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సహా చత్తీస్ గఢ్‌ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిని ప్రజల ముందుంచామన్నారు. ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక మేరకు మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. పవర్‌ కమిషన్‌, కాళేశ్వరం కమిషన్‌ విచారణలలో కేసీఆర్‌ చేసిన అక్రమాలు వెల్లడవుతాయన్నారు. విచారణ కమిషన్లు తమ పని తాము చేస్తున్నాయని, అక్రమాలు చేయకపోతే కమిషన్లపై కేసీఆర్‌ గగ్గోలు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో ఇరిగేషన్‌, విద్యుత్తు, పౌరసరఫరాల శాఖలతో పాటు ఇతర శాఖల్లోని స్కామ్‌లు చోటుచేసుకున్నాయన్నారు. గత పాలకుల దోపిడి ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలులో మెజార్టీ అమలు చేశామని, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీకి, రైతు రుణమాఫీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సంగతిని వివరించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అంతకుముందు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద నూతన ఐటిఐ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దొండపాడులో 20 కోట్లతో దొండపాడు – NH 9 కొత్త డబుల్ రోడ్డు నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులకు, లింగగిరిలో 20 కోట్లతో హుజూర్ నగర్ – యాతవాకిళ్ళ కొత్త డబుల్ రోడ్డు నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులకు, చిల్లేపల్లి లో 20 కోట్లతో చిల్లేపల్లి – సోమారం కొత్త డబుల్ రోడ్డు నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులకు, చిలుకూరులో 16కోట్లతో చిలుకూరు – జెర్రిపోతులగూడెం కొత్త డబుల్ రోడ్డు నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులకు, గణపవరంలో 10 కోట్లతో కీతవారి గూడెం – మునగాల కొత్త డబుల్ రోడ్డు నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. దొండపాడులో నూతనంగా ప్రతిపాదన చేసిన రెండవ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై రైతులతో చర్చించారు.

Latest News