విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని, కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ తో సహా చైర్మన్, వైస్ చైర్మన్ తో 10మందితో ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలపై మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఎత్తిపోతల పధకాల నిర్మాణాలలో విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రాజీ పడితే సహించేది లేదు అని హెచ్చరించారు. నాణ్యత లోపం వెలుగుచూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
రైతాంగం కళ్లలో వెలుగులు నింపేందుకే ఎత్తిపోతల పథకాలు అని..ఇందులో అవక తవకలు జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెరుగుతుంది అనుకుంటే స్వల్ప మార్పులకు ఆదేశాలిస్తున్నామని, అదనపు నిధుల మంజూరికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణాల పురోగతిని నెల వారిగా వివరించాలన్నారు. నగదు చెల్లించిన భూములను సత్వరమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణాలపై ఆయకట్టు రైతాంగం పెంచుకున్న ఆశలు సాకారం కావావంటే..వాటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పధకంతో పాటు జవహర్ జానపహాడ్ బ్రాంచ్ కెనాల్, బెట్టే తండా, నక్కగూడెం, రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాల పురోగతితో పాటు, హుజుర్ నగర్ లో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖా కార్యాలయ భవన పురోగతిపై ఆయన సమీక్షించారు.
అలాగే కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట, రాజీవ్ శాంతినగర్,ఆర్-9,మోతే ఎత్తిపోతల పథకాలతో పాటు కోదాడలో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖా కార్యాలయ భవన నిర్మాణం పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఇ.ఎన్.సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబులతో పాటు హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖాధికారులు పాల్గొన్నారు.
