విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదం అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన వెంటనే కవిత 4నెలల క్రితం సెప్టెంబర్ 2న తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఆ వెంటనే 3వ తేదీన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ రెడ్డిని కలిసి రాజీనామా లేఖను అందించారు. అయితే కవితతో నేరుగా మాట్లాడి రాజీనామా ఆమోదంపై నిర్ణయం తీసుకుంటానన్న గుత్తా నేటి వరకు రాజీనామా ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. కవిత తన రాజీనామా లేఖను పంపిన తర్వాత ఫోన్ చేసి ఆమోదించాలని కోరారని గుత్తా తర్వాత వెల్లడించారు. అయితే, తాను ఆమెకు పునరాలోచించుకోవాలని సూచించానని..ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు ఇంతేనా?
కవిత మాత్రం తన జనం బాట కార్యక్రమంలో తాను మాజీ ఎమ్మెల్సీనంటూ చెప్పుకుంటున్నారు. ఈ గందరగోళం మధ్య ఈ నెల 29నుంచి శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు కవిత వస్తారా?..సమావేశాల్లో మాట్లాడే అవకాశాన్ని వినియోగించుకుని తన ప్రత్యర్ధులపై చేయాల్సిన విమర్శలు చేసి…మరోసారి నేరుగా మండలి చైర్మన్ కు రాజీనామా లేఖ అందించి ఆమోదింపచేసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. 2021లో నిజమాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 వరకూ ఉంది. దీంతో ఇప్పుడు ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక అనివార్యం. కొత్తగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు అక్కడ స్థానిక సంస్థల సభ్యులు అధికారంలో లేరు. వాటి కాలపరిమితి పూర్తై ఏడాది దాటిపోయింది. కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తరువాత ఆ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్ని ఉంటుంది. అందుకే కవిత రాజీనామా ఆమోదం విషయంలో మండలి చైర్మన్ తాత్సారం చేస్తున్నారని తెలుస్తుంది.
ఉద్యమం నుంచి బహిష్కరణ వరకు
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ నిర్వహణతో తనవంతు కీలక భూమిక పోషించిన కవిత బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ఓ స్థాయిని సాధించారు. బీసీలు, మహిళల సమస్యలపై ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి గతంలో ఏంపీగా.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరించి చట్టసభలలో గుర్తింపు పొందారు. లిక్కర్ స్కామ్ కేసుతో కవిత జీవితం తీవ్ర కుదుపులకు లోనైంది. పార్టీలో కవిత క్రమంగా బలహీన పడుతూ వచ్చారు. ఈ కేసులోనే ఆమె తీహార్ జైల్లో వంద రోజులుకు పైగా ఉన్నారు. కేసీఆర్ చొరవతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కవితను అనేక ప్రయత్నాల అనంతరం బయటకు తీసుకొచ్చింది. అనంతరం ఆమె పార్టీలో తిరిగి క్రీయాశీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేయగా..అందుకు అవకాశం చిక్కలేదు. బీఆర్ ఎస్ లో తగిన స్థానం..తండ్రి కేసీఆర్ ఆస్తులలో వాటాలపై ప్రశ్నించిన కవితకు కేసీఆర్ కుటుంబం నుంచి నిరాశే ఎదురైంది. పార్టీలో, కుటుంబంలో ఎదురవుతున్న పరిణామాలతో అసహనానికి గురైన కవిత బీఆర్ఎస్ వరంగల్ వజ్రోత్సవ సభ పరిణామాలపై తండ్రి కేసీఆర్ కు లేఖ రాయగా..అది లీక్ అవ్వడంతో మరింత ఆగ్రహానికి గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన విమర్శలు బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇరకాటంలో నెట్టాయి. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ సొంత కూతురు అని కూడా చూడకుండా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో రెచ్చిపోయిన కవిత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర విమర్శలతో దాడి చేశారు.
టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావులే
తాను జైలులో ఉన్నప్పుడు బీఆర్ ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేశారని కవిత బహిష్కరణ పిదప సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో హరీష్‌రావు, సంతోష్‌ది కీలకపాత్ర అని ఆరోపించారు. వీరిద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్‌రావుది మేజర్ పాత్ర అని.. అందుకే హరీష్‌రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కేసీఆర్‌ను అడ్డుపెట్టుకుని హరీష్, సంతోష్ భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వరకు పరిస్థితి వచ్చిందన్నారు. కేటీఆర్ కు పార్టీని నడిపించే సత్తా లేదని, ఏదో ఒక రోజు పార్టీని ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
జనం బాటతో సొంత ఎదుగుదలకు ప్రయాస
బీఆర్ ఎస్ నుంచి బహిష్కరించబడిన తర్వాత ఏ పార్టీలో చేరుతారా..లేక సొంత పార్టీ ప్రకటిస్తారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగిస్తునే తెలంగాణ జాగృతి తరుపున కవిత జనం బాట చేపట్టారు. తనకు బీఆర్ఎస్ తో ఉన్న బంధం..బంధనాలు తెగిపోయాయని చెప్పుకున్న కవిత జనం బాట పేరుతో జిల్లాలు పర్యటిస్తూ తరుచూ హరీష్ రావు, సంతోష్ రావు సహా బీఆర్ఎస్ లో తనకు గిట్టని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన, ఎమ్మెల్సీలపైన పదునైనా ఆరోపణలు, విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సొంతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం పదవి తన లక్ష్యమని కూడా వెల్లడించారు. సామాజిక తెలంగాణ లక్ష్యం అంటూ చెబుతున్నారు. తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేస్తుందంటూ ఆసక్తికర ప్రకటనైతే చేశారు. అప్పటిలోగా కవిత రాజకీయ ప్రయాణం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
Residential Sales Report : ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఢమాల్
Danam Nagender : కేటీఆర్ తన తప్పులు తెలుసుకోవాలి
