విధాత, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కేటీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. గురువింద గింజ సామేత లెక్క కేటీఆర్ వైఖరి ఉందని..ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, ఏకవచనంతో సంబోధించడం సరికాదని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపైన, రాష్ట్ర సమస్యలపైన చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారని..కేటీఆర్ వాటిపై చర్చకు వస్తే మంచిదని సూచించారు.
సీఎం స్థాయి వ్యక్తిని ఏకవచనంతో విమర్శిస్తే..ఆయన కూడా అదే స్థాయికి దిగజారి మాట్లాడక తప్పదన్నారు. బీఆర్ఎస్ వాళ్లే సీఎంను ఏకవచనంతో వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారని..ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి ప్రతిస్పందించాల్సి వస్తుందని దానం స్పష్టం చేశారు. మంత్రుల అవినీతిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను దానం తప్పుపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ వద్దే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలు ఉంటే విచారణ జరిపించవచ్చని తెలిపారు.
ఉపఎన్నిక వస్తే మళ్లీ తప్పక గెలుస్తానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అండతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని..మరోసారి రాజీనామా చేయడానికైనా, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికైనా నా ధైర్యం కార్యకర్తలేనని అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చార్జ్ షీట్
Kavitha : బీఆర్ఎస్, కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే పాలమూరుకు నీటి గోస
