BRS | గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ బీఆరెస్‌ సమీక్షకు కీలక నేతల డుమ్మా

నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆ జిల్లాలకు సంబంధించిన కీలక నేతలు డుమ్మా కొట్టాడం చర్చనీయాంశమైంది

  • Publish Date - May 15, 2024 / 05:02 PM IST

ఆందోళనలో పార్టీ నాయకత్వం

విధాత, హైదరాబాద్‌: నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆ జిల్లాలకు సంబంధించిన కీలక నేతలు డుమ్మా కొట్టాడం చర్చనీయాంశమైంది. దాదాపుగా 130మందిని పిలిస్తే సగం మందే వచ్చారన్న ప్రచారం గులాబీ వర్గాల్లో వినిపిస్తుంది.

సన్నాహాక సమావేశానికి గైర్హాజరైన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా ఉన్నారు. వారంతా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్ధి రాకేష్ రెడ్డిని వ్యతిరేకించిన వరంగల్ జిల్లాకు చెందిన నేతలే కావడం గమనార్హం. రాకేశ్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సన్నిహితుడన్న ముద్ర పడింది.

ఇప్పటికే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకపక్ష ధోరణితో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పల్లా వర్గీయుడిగా ఉన్న రాకేశ్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. అందుకే వారంతా సన్నాహక సమావేశానికి డుమ్మా కొట్టినట్లుగా ప్రచారం సాగుతుంది. గతంలో బీఆరెస్‌ నాలుగుసార్లు గెలిచిన ఈ గ్రాడ్యూయేట్‌ స్థానంలో ఈ దఫా గెలుపు అంతా సులభంగా కనిపించడం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆరెస్‌లో నెలకొన్న నైరాశ్యం..పలువురు నేతల వలసలతో ఢీలా పడిన పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోను భారీ విజయాలపై ఆశలు పెట్టుకోలేదు. అటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రత్యర్థి తీన్మార్‌ మల్లన్న బలమైన పోటీదారుగా ఉండటం, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తుండటం, కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకుడు అశోక్‌ ఇండిపెండెంట్‌గా బరిలో ఉండటంతో బీఆరెస్‌ గట్టిపోటీ ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో బీఆరెస్‌లోని నేతల మధ్య నెలకొన్న విబేధాలు రాకేశ్‌రెడ్డి గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Latest News