విధాత : బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏఐసీసీ నేతలతో వరుస భేటీలలో బిజీబిజీగా ఉన్నారు. ఆయన వెంట బీజేపీకి చెందిన మరో నేత, మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవిందర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా రాజగోపాల్‌రెడ్డితో పాటే కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. రాజగోపాల్‌రెడ్డి, రవిందర్‌రెడ్డిలు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కాగా గురువారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్‌తో, మాణిక్‌రావు ఠాక్రేలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ రెండో జాబితా వెలువడనున్న నేపధ్యంలో తాను పోటీ చేసే స్థానాల టికెట్లకు సంబంధించి ఆయన వారితో చర్చలు జరిపారు. మునుగోడుతో పాటు సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు గజ్వెల్ స్థానం కాంగ్రెస్ టికెట్ కూడా రాజగోపాల్‌రెడ్డి కోరినట్లుగా తెలుస్తున్నది.
అయితే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో గజ్వెల్ నుంచి తూముకుంట నర్సారెడ్డిని ఇప్పటికే అభ్యర్ధిగా ప్రకటించిన నేపధ్యంలో గజ్వెల్ టికెట్‌ను రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఏనుగు రవిందర్‌రెడ్డి కూడా తన టికెట్ విషయమై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో తన టికెట్ ఖరారుపై చర్చించారు.