విధాత: ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోవడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆరెస్‌పై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ చేసిన 420 మోసపూరిత హామీలతోనూ, ఉద్యోగాల విషయంలో చెప్పిన అబద్ధాలతోనే ఓడిపోయమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినబడాలంటే.. తెలంగాణ బలం.. దళం చూడాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్ గెలువాల్సిన అవసరముందని అన్నారు. బీఆరెస్ ఎంపీలు గెలువకపోతే తెలంగాణ పదం మాయమవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆరెస్ మాత్రమేనని చెప్పుకొన్నారు.
లోక్‌సభ స్థానాలవారీగా బీఆరెస్ ఎన్నికల సన్నాహక సమావేశాలు బుధవారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ స్థానంతో ప్రారంభమయ్యాయి. అదిలాబాద్ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆరెస్ మాత్రమేనని, జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రానికి గౌరవ ప్రదమైన నేతగా ఒకరు పేరు వినబడుతుందని, తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కేసీఆర్ పేరు మాత్రమేనన్నారు. కేంద్రంతో తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక నిలబడి కలబడాలంటే బీఆర్ఎస్కే సాధ్యమన్నారు. తెలంగాణ హక్కుల సాధనకు కొట్లాడటం బీజేపీ, కాంగ్రెస్‌తో కాదని చెప్పారు. ‘గతంలో పార్లమెంటులో ఎప్పుడైనా తెలంగాణ గురించి మోదీ, రాహుల్ మాట్లాడారా?’ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆరెస్ అన్నారు. బీఆరెస్‌కు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణ మాత్రమేనన్నారు.
సీఎంగా కేసీఆర్ లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బీఆరెస్‌పై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ చేసిన 420మోసపూరిత హామీలతోనూ, ఉద్యోగాల విషయంలో చెప్పిన అబద్ధాలతో మనం ఓడిపోయమన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిందని, ఆ పార్టీ హామీల వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్ మంచి విజయాలు నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు ప్రధాన కేంద్రం హైదరాబాద్, తెలంగాణ. మా ప్రధాన ఎజెండానే తెలంగాణ. కాబట్టి.. తెలంగాణ కోసం, సమస్యలు, హక్కులు, వాటాల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది.. బలంగా కృషి చేయగలిగేది బీఆరెస్ ఒక్కటే’ అని చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని మాట్లాడినా కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చిందన్నది నిర్వివాదమైన అంశమని అన్నారు. కేసీఆర్‌తోనే ఈ రాష్ట్రానికి అస్థిత్వం వచ్చిందని, తెలంగాణకు పర్యాయపదంగా కేసీఆర్ నిలిచారని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన కృషిని ఈ సందర్భంగా మరోసారి ఏకరవు పెట్టారు.