Site icon vidhaatha

KTR | జాబ్ క్యాలెండ‌ర్ ఎటుపాయే.. మెగా డీఎస్పీ ముచ్చటే లేదాయే: కేటీఆర్

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండ‌ర్ ఊసు లేదని, మెగా డీఎస్సీ ముచ్చ‌ట‌నే లేదని, బీఆరెస్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఇప్ప‌టికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాన‌ని సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. న‌ల్ల‌గొండ, హాలియా పట్టణాల్లోనిర్వ‌హించిన‌ ఖ‌మ్మం-వ‌రంగ‌ల్-న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లలో బీఆరెస్‌ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తుగా కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ చెప్పిన 2లక్షల ఉద్యోగాల కల్పన కార్యాచరణకు దిక్కు లేదని, మ‌రి అర‌చేతిలో వైంకుఠం చూపెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా వద్దా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో 4లక్షల 70వేల మంది ఓటర్లు ఆలోచించాలని కోరారు. పదేండ్ల పాటు నిజాయితీగా ప‌ని చేసిన బీఆరెస్‌కు ఓటెద్దామా..? ఒక గోల్డ్ మెడ‌ల్ సాధించి ప్ర‌జాసేవ‌కు అంకిత‌మైన రాకేశ్ రెడ్డికి ఓటేద్దామా..? మీడియా, యూట్యూబ్ అడ్డం పెట్టుకుని దందాలు చేసే చీట‌ర్ల‌కు ఓటేద్దామా..? అనేది ఆలోచించాల‌ని ప‌ట్ట‌భ‌ద్రుల‌కు కేటీఆర్ సూచించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థితో నల్లగొండ మంత్రులకే ఎసరు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థితో నల్లగొండ మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఎస‌రు త‌ప్ప‌ద‌ని కేటీఆర్ అన్నారు. తెల్లారి లేస్తే బూతులు, పెద్ద వాళ్ల‌ను తిట్ట‌డం, బెదిరించ‌డం, బ్లాక్ మెయిల్ చేయ‌డం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ప‌ని అని, ఆయ‌న‌పై 56 కేసులు ఉన్నాయని, అలాంటి గుణ‌గ‌ణాలు ఆయనకున్నాయని ఎద్దేవా చేశారు. మ‌రి బిట్స్ పిలానీలో చ‌దివి స‌మాజం మీద అవ‌గాహ‌న ఉన్న విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డిని గెలిపిసాత్రా లేక బ్లాక్ మెయిల‌ర్‌కు ప‌ట్టం క‌డుతారా అన్నది ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించుకోవాలన్నారు. ఈ ఎన్నిక‌తో ప్ర‌భుత్వం కుప్ప‌కూలేదేమీ లేదని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే నాయ‌కుడు కావాలని, మండ‌లిలో బాకా ఊదేటోళ్లు ఉండొద్దని, ప్ర‌భుత్వం భాజా బ‌జాయించి గొంతు విప్పి ప్ర‌శ్నించేటోళ్లు, నిల‌దీసేటోళ్లు కావాలి అని కేటీఆర్ అన్నారు.

ఐదు నెల‌ల్లోనే ఐదేండ్ల అప‌ఖ్యాతి

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే ప్రజలను ఎన్నికల హామీలపై మోసం చేసిందన్న అపఖ్యాతి మూటగట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. సన్న దాన్యంకి 500బోనస్ ఇస్తామని మాట మార్చి సన్న వడ్లకేనని సన్నాయి నొక్కులు నొక్కుతుందన్నారు. ఒక్కటి కాదు 420 హామీలను ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేశారన్నారు. మంచిగా ఉన్న బీఆరెస్‌ పాలనను దూరం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్నరని చెప్పారు. ఇకనైనా ఆలోచించి ఓటేయండని ఆగం కావద్దని ఎవ‌రి వ‌ల్ల లాభం జ‌రుగుతుందో ఆలోచించాలన్నారు. బ్లాక్ మెయిల‌ర్లు, దందాలు చేసేటోళ్ల‌కు అవ‌కాశం ఇస్తే స‌మాజానికి తీవ్ర న‌ష్టమని అటువంటి వారిని తరిమికొట్టాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆరెస్‌.ఫ్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల బీఆరెస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version