KTR : వాటాల పంచాయతీల్లో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నాయకులు, మంత్రులు పాలనను గాలికి వదిలివేసి, 'వాటాల పంచాయతీలతో' కొట్టుకుచస్తున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే, కాంగ్రెస్ దొంగలు కమిషన్లు, కబ్జాలు, పోస్టింగుల వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు.

KTR and Harish Rao

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులు, మంత్రులు రాష్ట్రంలో వాటాల పంచాయతీలతో కొట్టుకచస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ఱ్రంలో రుణమాఫీ కాలేదు, బోనస్ బోగస్ అయ్యింది..ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదు అని విమర్శించారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షాలకుకల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతుంటే, వరదకు కొట్టుకుపోతుంటే రైతన్నలు అరిగోస పడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ దొంగలేమో నీకు ఎంత నాకు ఎంత
అనే వాటాల పంచాయితీల్లో కొట్టుకుచస్తున్నారంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.

హరీష్ రావు సైతం అవే విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి టి.హరీష్ రావు సైతం అవే విమర్శలు చేశారు. క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు ఒకటి కాదు, రెండు కాదు అరడజను వర్గాలుగా చీలిపోయారని, ఒకరంటే ఒకరికి పడుతలేదు అని ఆరోపించారు. సీఎం, మంత్రులు.. పాలన గాలికి వదిలి పర్సనల్ పంచాయతీలు పెట్టుకుంటున్నారన్నారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, కబ్జాల కోసం ఒకరు, పోస్టింగుల కోసం ఒకరు.. ఇది మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు.. దండుపాళ్యం ముఠా లెక్క ఉందని విమర్శించారు. అతుకుల బొంతగా ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతదో అని స్వయంగా మంత్రులే భయపడుతున్నారని, క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి, మంత్రుల పంచాయతీ పెట్టుకున్నారని విమర్శించారు. ఒక మంత్రికుమార్తెనే స్పష్టంగా చెబుతున్నారు.. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పట్టి వసూళ్ల కోసం బెదిరించారంటూ హరీష్ రావు కాంగ్రెస్ మంత్రుల పంచాయతీని ఎండగట్టారు.