విధాత : ప్రజాతిరస్కారంతో బీఆరెస్ ఓడిపోయిందన్న ప్రజాస్వామిక సత్యాన్ని అంగీకరించడంలో బీఆరెస్ అగ్రనేతలు అస్సలు అంగీకరించడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచినా ప్రజాతీర్పును అవగతం చేసుకోవడంలో, ఓటమిపై ఆంతర్మథనం.. ఆత్మ విమర్శ చేసుకోవడంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పదేపదే తప్పటడుగులు వేస్తున్న తీరుపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ ఏకపక్ష.. స్వీయ నిర్ణయాల ఫలితంగా ఎదురైన ఓటమి అని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నా, అటూఇటూ తిప్పుతున్నారే తప్పించి.. ఓటమి కారణాలను కారణాలను స్వీకరించే పరిస్థితి కనిపించడం లేదని సీనియర్ పాత్రకేయుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పును హుందాగా స్వీకరించకుండా, ఇంకా తొక్కులాడుతునే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీఆరెస్ అదిలాబాద్ లోక్‌సభ నియోజవకర్గం సన్నాహక సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ‘మా నియోజవర్గం ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో ఓడించాం.. సీఎంగా కేసీఆర్ దిగిపోతారని అనుకోలేదన్నారు. ఆయన సీఎంగా లేకపోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని గ్రామాల్లో చర్చ జరుగుతుంది’ అంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను ఓడిస్తే సహజంగానే ప్రభుత్వం పడిపోతుంది. ఈ లాజిక్ కూడా కేటీఆర్‌కు అర్థం కాలేదా? అన్న సందేహాలు వెలువడుతున్నాయి. ఇది ప్రజా తీర్పును వక్రీకరించడమే కాకుండా.. అధినేతను ఇంకా కాపాడుకునే ప్రయత్నమేనని పరిశీలకులు అంటున్నారు.
అంతేగాక పదేళ్ల బీఆరెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, స్వల్ప లోటుపాట్లు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారంటూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. సిటింగ్‌లపై వ్యతిరేకత ఉన్నా.. ఓట్లు వేసేది వారికి కాదు.. నాకే అన్న కేసీఆర్ అహంభావ పోకడే బీఆరెస్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల 32మెడికల్ కళాశాలలకు బదులుగా యూట్యూబ్ చానెళ్లు పెటుకుని ప్రచారం చేసుకుంటే జనం నమ్మి బీఆరెస్‌ను గెలిపించే వారంటూ కేటీఆర్ ప్రజాతీర్పును అపహాస్యం చేసేట్లుగా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమ్‌రాంగవ్వడం అంతా చూసిందే. అయినా కేటీఆర్ అదే ధోరణితో ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించకుండా కప్పదాట్లు వేస్తుండటం ఆయన ఇమేజ్‌ను మరింత డామేజ్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తొలుత ఎన్నికల్లో మాకు, కాంగ్రెస్‌కు కేవలం 2శాతం ఓట్ల తేడా మాత్రమేనని, ప్రతిపక్షాలతో కలిపి మాకు 59మంది బలం ఉందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనలోని అహానికి దర్పణంగా నిలిచాయన్న విమర్శలకు దారి తీశాయి. శ్వేతపత్రానికి స్వేద పత్రంతో కౌంటర్ వేసినప్పటికీ ఆ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వకపోగా.. రాష్ట్ర ఆస్తుల కంటే బీఆరెస్ నేతల ఆస్తులే పెరిగాయన్న వాదనను తెరపైకి తీసుకొచ్చింది. అది మరువకముందే ఇప్పుడు కాంగ్రెస్ 420 హామీల బుక్‌లెట్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఎదురుదాడి కూడా జనంలోకి బలంగా వెళుతున్నది. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే హామీల అమలులో వైఫల్యం చెందిందంటున్న బీఆరెస్ 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను పదేళ్లలో అమలు చేయని సంగతిని కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్నారు.
పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల స్వేచ్చను హరించారని, నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన సాగించారన్న ప్రతిపక్షాల ప్రచారానికి, వారిచ్చిన హామీలను ఆమోదించే ప్రజలు పాలన మార్పు కోరి ఎన్నికల్లో ప్రజాతీర్పుతో ప్రభుత్వాన్ని మార్చారు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైతే త్వరలోనే వచ్చే పార్లమెంటు, స్థానిక ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవు. అలాంటప్పుడు అధినేత చెప్పినట్లుగా 100 రోజుల సమయం కూడా కొత్త ప్రభుత్వానికి ఇవ్వకుండా హామీల అమలులో వైఫల్యంపై బీఆరెస్ నేతలు చేస్తున్న గగ్గోలు వారిలోని అసహానాన్ని చాటుతుందంటున్నారు విశ్లేషకులు.