విధాత : ‘బంధు’ పథకాలు వికటించి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమికి కారణమయ్యాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని దీంతో బీసీ బంధు, రైతుబంధు, మైనార్టీ బంధు, దళిత బంధు వంటి పథకాల సహాయం అందని ప్రజలు బీఆరెస్‌పై వ్యతిరేకత చూపారన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్లు కూడా కేసీఆర్ సీఎం కాలేదని బాధపడుతున్నారని, ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం ఏ మాత్రం చెక్కు చెదరలేదన్నారు. 1985-89 మధ్య జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలు తెచ్చినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. మొన్న కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్ళు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగనుందని, ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆరెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేస్తున్నదని విమర్శించారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే నిరసన సెగలు మొదలయ్యాయన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గతంలో పాలకులు తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆరెస్ మాత్రమేనన్నారు. బీఆరెస్ బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవన్నారు. 2009లో కేవలం 10 అసెంబ్లీ సీట్లే గెలిచామని, కేసీఆర్ దీక్షతో ఆరు నెలల్లోనే పరిస్థితి మారిందని గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగాలేకపోయినా ప్రజలు దీవించారని గుర్తుచేశారు. ఈసారి 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది చిన్న సంఖ్య ఏమీ కాదని కేటీఆర్ అన్నారు. మూడింట ఒక వంతు సీట్లు గెలిచామని చెప్పారు.
జుక్కల్‌లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని, కేవలం 11 వందల ఓట్లతో ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్‌లో గెలిచారన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయన్నారు. దళిత బంధు పథకాన్ని నిజాం సాగర్ మండలం మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు బీఆరెస్‌కు ఓట్లు వేయలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ సీటును బీఆరెస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.