విధాత : తాము పరిపాలన చేస్తున్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవే చేస్తున్నదని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ‘మేం సచివాలయం కడితే అభ్యంతరం చెప్పారు. కొత్త అసెంబ్లీ కడుతుంటే వద్దన్నారు. కానీ.. వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వంద ఎకరాల్లో హైకోర్టు కడతామని అంటున్నారు. మరి దీన్నేమంటారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద నిధులు లేవు అంటూ సీఎంకు కొత్త క్యాంపు కార్యాలయం కట్టడం అవసరమా? అని నిలదీశారు. సీఎంలు మారినప్పుడల్లా కొత్త క్యాంపు కార్యాలయాలు కడతారా? అని సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సలహాదారులు ఉండొద్దని గతంలో కోర్టుకు వెళ్లిందే రేవంత్ రెడ్డి అని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆయనే సలహాదారులను క్యాబినెట్ ర్యాంకుతో నియమించుకున్నారని విమర్శించారు. రైతు భరోసా ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి దావోస్‌లో పచ్చి అబద్దం చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధం చెప్పిన సీఎం తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతామని మంత్రులు అంటున్నారని పేర్కొన్నారు. లేని రైతు భరోసా గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది ఢిల్లీ పర్యటనలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతున్నదని చెప్పారు. కేసీఆర్‌పై కుట్ర పన్నేందుకు రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు. అదానీతో రేవంత్ రెడ్డి జత కట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు వరకూ అదానీని వ్యతిరేకించి, ఇప్పుడు అదానీ సంస్థలతో ఒప్పందాలు ఎలా చేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.
స్వల్ప కాలంలోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత
కాంగ్రెస్ 420 హామీలపై వెంటపడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంత స్వల్పకాలంలో అనేక వర్గాలను దూరం చేసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యలపైన పార్టీ తరఫున మాట్లాడతామని, వారి సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను, కృష్ణా బేసిన్ ప్రజల ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టుపెట్టేలా కేఆర్‌ఎంబీ అంశంపైన ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. దీనిపై శాసనసభలో చర్చించాల్సివుందన్నారు. అఖిలపక్షాన్ని వేయాల్సిందన్నారు. ఇలాంటి అన్ని అంశాలపై కచ్చితంగా ప్రతిపక్షంగా మాట్లాడుతామన్నారు. కొత్తగా వచ్చామని చెప్తున్న ప్రభుత్వం అడ్డగోలుగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నదో చెప్పాలని నిలదీశారు. ఫార్మసిటీ రద్దు, ఎయిర్ పోర్టుకు మెట్రో రద్దు పైన ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించినట్టు లేదని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి కీలకమైన అంశంపైన ఏం జరిగిందో ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తునక లెక్క కాంగ్రెస్‌కు అప్పగించామని కేటీఆర్ చెప్పారు. కొంత సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారు కానీ, అడ్డగోలుగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మాట్లాడక తప్పడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని పక్కన పెట్టిన విషయం ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులకు పాల్పడుతున్నదని విమర్శించారు. నిరుద్యోగ భృతి పైన భట్టి విక్రమార్క అసెంబ్లీలో తప్పుడు మాట చెప్పారన్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజు ఎలైట్ బార్లు పెడతామంటుంన్నదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదంటూనే కొండా సురేఖ నిన్న లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు చెబుతున్నారని అన్నారు. పంటకు 500 బోనస్ మద్దతు ధర ఇస్తారా ఇవ్వరో చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే జీవోలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. వందరోజుల హమీలపై జీవోలు ముందే ఇవ్వాలని కోరారు. 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీల అమలుపైన వెంటనే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోటీ 57 లక్షల మంది రూ.2,500 ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
శుక్రవారం కేసీఆర్ సమావేశం
శుక్రవారం కేసీఆర్ బీఆరెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం పెట్టారని.. గాయం తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న మొదటి సమావేశం ఇదేనని కేటీఆర్ తెలిపారు. 27వ తేదీన తెలంగాణ భవన్‌లో మైనార్టీ సెల్ సమావేశం ఉంటుందన్నారు. శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఉంటాయని తెలిపారు. త్వరలో మంచి మహూర్తం చూసుకుని కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌కు వస్తారని తెలిపారు.
మా సర్పంచ్‌లు ఉన్నందునే ఎన్నికలకు జంకు
గ్రామ పంచాయితీ భవనాలను ప్రారంభించకుండా, పెండింగ్ బిల్లలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ల మనోభావాలను దెబ్బ తీస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, లేదంటే ఉన్న సర్పంచ్‌లకు పొడిగింపు ఇవ్వాలని సవాల్ చేశారు. 80 శాతం బీఆరెస్ సర్పంచ్‌లే ఉన్నారన్న అక్కసుతో ప్రభుత్వం దురాలోచనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌల్తాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదాలో కూర్చున్నారని కేటీఆర్ నిలదీశారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు పెట్టిన చోట విప్ జారీ చేశామని.. విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. ఎంపీ స్థానాలవారీగా నిర్వహించిన సమావేశాలు విజయవంతం అయ్యాయని కేటీఆర్ తెలిపారు. కార్యకర్తలు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని చెప్పారు. త్వరలో 30 వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని తెలిపారు. స్వల్ప తేడాతో 14 అసెంబ్లీ స్థానాలు కోల్పోయామని కేటీఆర్ చెప్పారు.