ఆర్థిక పరిస్థితులతో నేతన్న మృతి: కేటీఆర్

ఆర్థిక పరిస్థితుల కారణంగా శనివారం ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల రాజీవ్ నగర్ కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని మాజీ మంత్రి కే తారక రామారావు ఓదార్చారు.

  • Publish Date - April 8, 2024 / 12:11 PM IST

  • పాలసీలు మార్చాలి అనుకోవడం సరికాదు
  • నేత కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే!
  • లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

 

విధాత బ్యూరో, కరీంనగర్: ఆర్థిక పరిస్థితుల కారణంగా శనివారం ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల రాజీవ్ నగర్ కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని మాజీ మంత్రి కే తారక రామారావు ఓదార్చారు. విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లిన కేటీఆర్ కుటుంబ పరిస్థితుల గురించి ఆరా తీశారు. పార్టీ పరంగా ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించారు. అంత్యక్రియల భారం సదరు కుటుంబంపై పడకుండా ఏర్పాట్లు చూడాలని స్థానిక పార్టీ నేతలను ఆదేశించారు. వస్త్ర పరిశ్రమ ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేకపోవడంతో లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

మూడు నెలలుగా ఉపాధి లేకపోవడం, ఇదే సమయంలో భార్యకు పక్షవాతం సోకడం, టెక్స్ టైల్ పార్కులో బతుకమ్మ చీరలు నేసే వీరి పెద్ద కుమారుడు ఆర్డర్లు లేకపోవడంతో, బయట టీ స్టాల్ పెట్టుకున్నప్పటికీ అంతగా ఉపయోగపడకపోవడం, హైదరాబాద్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న వీరి చిన్న కుమారుడు ఉపాధి కోల్పోవడం.. ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముట్టడంతో మానసిక మీద తట్టుకోలేక లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు తెలిపారు.

ప్రస్తుతం రాజకీయాలు ముఖ్యం కాదని, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పాలసీని మార్చాలనుకోవడం సరికాదన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ తోఫా ఆర్డర్ల ద్వారా గతంలో 9 నెలలపాటు ఉపాధి లభించింది అన్నారు. వాటిని నిలిపివేయడం ద్వారా నేత కార్మికుల నోటి దగ్గర ముద్ద గుంజుకున్నట్టు అయిందన్నారు.

“అమ్మ ధైర్యంగా ఉండండి.. ఈ సమయంలోనే ధైర్యం ప్రదర్శించాలి.. పిల్లల కోసం బతకాలి” లక్ష్మీనారాయణ మృతి విషయం కలెక్టర్ తో మాట్లాడా, నేత కార్మికుల మృతి సందర్భంగా ఇచ్చే మొత్తాన్ని సత్వరం అందించే ప్రయత్నం చేయాలని సూచించా.. లక్ష్మీనారాయణ కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని కోరాను అన్నారు.

Latest News