Kunamneni Sambashiva rao | హైదరాబాద్ : భద్రాచలం సమీపంలో ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సానుకూల దిశగా అడుగులు వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. భద్రాచలంలోని సీతారామ స్వామి దేవాలయానికి సంబంధించిన దేవాదాయ భూములు ఈ గ్రామాలలో ఉన్నాయని, తెలంగాణ నుండి దేవాలయానికి రావాలన్నా కూడా ప్రస్తుతం ఏపీలో ఉన్న ఈ ఐదు గ్రామాలు దాటుకుంటూ రావాలని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పెద్ద మనసుతో ఐదు గ్రామాలు తెలంగాణకు ఇవ్వడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం సందర్భంగా సానుకూలంగా స్పందించాలని కోరారు. అలాగే కృష్ణా జలాల పంపిణీ విషయంలో నాటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ వైఖరితో స్థబ్ధత నెలకొందని, ఇరు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొన్నదని అన్నారు. కావున సుహృద్భావ వాతావరణంలో జల సమస్యలను సత్వరంగా పరిష్కరించుకునేందుకు సీఎంల సమావేశం వేదిక కావాలని అన్నారు.