– హైకోర్టు వారించినా యథేచ్ఛగా ప్లాటింగ్
– అడ్డగోలుగా చెట్ల నరికివేతలు
– ఆవాసం కోల్పోయి చనిపోతున్న నెమళ్లు
– పెద్దఎత్తున ఉనికి కోల్పోతున్న జీవరాశులు
– కోర్టులనే మాయ చేస్తున్న మోసగాళ్లు
– డివిజన్ బెంచ్ ఉత్తర్వులు దాచి పెట్టి
సింగిల్ బెంచ్ వద్ద ఇంటీరియం ఆర్డర్
– కార్పొరేట్ కంపెనీల మాయాజాలం
– నిషిద్ధ జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్లు
– గత ప్రభుత్వ అండతో భూ మాయ
– శంకర్ హిల్స్ పేరుతో ఫినీక్స్ దందా!
విధాత, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రాబందులకు జీవవైవిధ్యం బలవుతున్నది. మహానగరానికి ఆర్థిక ఆయువుపట్టు అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు ఆనుకొని పెద్ద ఎత్తున ఉన్న పచ్చని చెట్లు, వాటిలో విహరించే పక్షులు, పురివిప్పే నెమళ్లు, ఛెంగుఛెంగున దూకే కుందేళ్లు మొదలుకుని.. అడవి పందులవరకూ జీవజాలం పుష్కలంగా ఉన్న వ్యవసాయ భూములు ఇప్పుడు రియల్ మాఫియా ప్రవేశంతో శ్మశానంగా మారిపోతున్నాయి. అమెరికన్ కాన్సులేట్‌కు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రాబందులు వివిధ రూపాల్లో కబ్జాకు యత్నిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల అండదండలు ఉండటంతో గతంలో రెచ్చిపోయాయి. కొత్త ప్రభుత్వం వచ్చినా వాటి ఆగడాలు ఆగడం లేదని స్థానికులు వాపోతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఒక మంత్రి ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి, ‘నీకేం పని? వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారు. అడ్డుకోవద్దు’ అని హూంకరించడంతో పోలీసులు ఆ వైపు వెళ్లడానికి కూడా సాహసించలేదని చెబుతున్నారు. దీంతో కార్పొరేట్ గద్దలు మారు రూపంలో శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్ల పేరుతో రంగంలోకి దిగి అక్కడ దందా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మాయగాళ్లు ఇక్కడ చెట్లన్నీ యథేచ్ఛగా కొట్టిపడేశారు. పక్షులు, నెమళ్లతో పాటు ఇతర జీవరాశులకు ఆవాసం లేకుండా చేశారు. దీంతో అనేక నెమళ్లు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతర జీవరాసులు కూడా అక్కడ కనిపించడం లేదని అంటున్నారు.
వేయి ఎకరాల విస్తీర్ణయంలో అటవీ ప్రాంతం
హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్‌కు లోపల ఉంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలానికి చెందిన వట్టినాగుల పల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు వేయి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం ఆనేక చెట్లు, గుట్టలు, పక్షులు, ఇతర జీవరాసులకు ఆలవాలం. ఇక్కడ వందల సంఖ్యలో నెమళ్లు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని సంరక్షించడంతోపాటు గండిపేట క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలో ఉన్న ఈ గ్రామం సహా 84 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం 1996 మార్చి 8వ తేదీన 111 జీవో పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం ఈ ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి నిర్మాణాలు కానీ లే అవుట్లు కానీ చేయకూడదు. బీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయో కన్జర్వేషన్ జోన్ కింద ఉన్న వట్టినాగులపల్లి ప్రాంతంపై కన్నేసిన కార్పొరేట్ రియల్ మాఫియా కొంతమంది నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో అన్ని రకాల బల ప్రయోగాలతో ఈ ప్రాంతం ఆనవాళ్లని చెరివేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రాక్షస ప్రక్రియ ఇంకా యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇటువైపు కన్నెత్తి చూసేలోగా మొత్తం కాజేయాలన్న తీరుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
118లోనూ లేని వట్టినాగులపల్లి
జీవో 111 ప్రకారం నిర్దేశింత గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు కానీ, డీటీసీపీలకు కానీ, హుడా, హెచ్ఎండీఏలకు కానీ ఎలాంటి లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉండదు. పాతవి ఏమైనా లేఅవుట్లు ఉన్నా చెల్లవు. అయినప్పటికీ కాస్త ఉదారంగా వ్యవహరించిన మున్సిపల్, హెచ్ఎండీఏ, డీటీసీపీ అధికారులు అనధికారికంగా ఉన్న లేఅవుట్లను కూడా గుర్తించి, తమపై అధికారులకు నివేదించారు. అలా నివేదించిన లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అనుమతి ఇస్తూ 2022 అక్టోబర్ 28వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో 118 విడుదల చేసింది. అలా విడుదల చేసిన జీవోలో కూడా వట్టినాగులపల్లి గ్రామం పేరు లేనేలేదు.
చీఫ్ జస్టిస్ ఆదేశాలూ బేఖాతర్
జీవో 111లో యథేచ్ఛగా అక్రమ లేవుట్లు, నిర్మాణాలు జరుగుతున్న విషయంపై పర్యావరణవేత్త జీవానందరెడ్డి 2007లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సీరియస్ అయింది. శంకర్ హిల్స్ సహా మొత్తం 29 సంస్థలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే పిటిషన్‌లో తాజాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ డివిజన్ బెంచ్.. 2023 సెప్టెంబర్ 22వ తేదీన శంకర్ హిల్స్‌తో సహా ఏ ఒక్కరూ ఇక్కడ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది. దీనికి గత ప్రభుత్వం కూడా 111 జీవో నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే కోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చేవరకు 111 జీవోను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పింది. దీనిపై ఎట్లాంటి పనులు చేయాలన్నా కోర్టు అనుమతి తప్పని సరి. కానీ ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాలు కూడా బేఖాతర్ అయ్యాయని పర్యావరణ నిపుణులు విమర్శిస్తున్నారు. అడ్డగోలుగా లేఅవుట్ల పేరుతో దందా చేస్తున్నా.. హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
వట్టినాగులపల్లిలో శంకర్ హిల్స్ పేరుతో ఫినిక్స్ దందా!
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని వట్టినాగులపల్లి గ్రామాన్ని నార్సింగి మున్సిపాలిటీలో విలీనం చేసే సమయంలో ఈ రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్న అనధికారిక లేఅవుట్ల జాబితాను పురపాలక శాఖకు సమర్పించింది. శంకర్ హిల్స్ పేరిట కనీసం అనధికారిక లేఅవుట్ కూడా లేదని విలీనం సమయంలో గ్రామ పంచాయతీ రిపోర్ట్ ఇచ్చింది. శంకర్ హిల్స్ పేరిట ఎలాంటి లేఅవుట్ లేదని హుడా, నార్సింగి మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ ధృవీకరించాయి. ఈ మేరకు ధృవీకరణ పత్రాలుకూడా ఇచ్చాయి.
ఆది నుంచి వ్యవసాయ భూములే..
ఫైనాన్షియల్ జిల్లాకు ఆనుకొని ఉన్న వట్టినాగులపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన భూములన్నీ మొదటి నుంచి వ్యవసాయ భూములే. 1956 కాస్రా పహాణీ మొదలుకొని ఇప్పటి వరకూ వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. శంకర్ హిల్స్ వాళ్లు చెపుతున్నట్లుగా 1983 నుంచి కూడా ఎక్కడా లేఅవుట్‌గా రికార్డ్ కాలేదు. కనీసం గ్రౌండ్ మీద కూడా లేఅవుట్ చేసిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఎలాంటి లేఅవుట్ లేదని గతంలో అడ్వకేట్ కమిషన్ కూడా ధృవీకరించింది. అడ్వకేట్ కమిషన్ రిపోర్ట్ ఐఏ నంబర్ 1201/2001, ఓఎస్ నంబర్ 60/2001 రంగారెడ్డి జిల్లా కోర్టుకు కమిషన్ రిపోర్ట్ సమర్పించింది కూడా.
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
ఈ భూములపై కన్నేసిన కార్పొరేట్ కంపెనీ ఫీనిక్స్.. తన బినామీ కంపెనీలైన ఈక్విడిస్టెంట్, శ్రీనిధి లగ్జరీ విల్లాస్, ఈశాన్వి ఇన్‌ఫ్రా, ఆర్అండ్ఆర్ రియల్టర్స్, టాప్ నాచ్ బిల్డర్స్, సన్‌షైన్ డెవలపర్స్, క్రియేటివ్ డెవలపర్స్, క్రిస్టల్ డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేట్, ఎస్ఎన్‌డీ హోమ్స్, వైసార్ ఇన్‌ఫ్రా, ఎలిగెంట్ మార్కెటింగ్ తదితర కంపెనీలు, వ్యక్తుల పేరుతో అక్రమంగా 114 డాక్యుమెంట్లతో నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్టర్ చేసుకొని, శంకర్ హిల్స్‌ను తెరముందు పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది బయోకన్జర్వేషన్ జోన్‌లో అక్రమంగా లేఅవుట్ చేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెట్లు కొట్టి వేసి, కొండలను పగుల కొట్టి, నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు తదితర జీవరాశులను చంపి యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యుల అండదండలతో రెచ్చిపోయిన వీరు.. ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా బీఆరెస్‌కు చెందిన ఒక మంత్రి ఫోన్ చేసి పోలీసులను కూడా ప్రభావితం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా బయోకన్జర్వేషన్ జోన్‌ను నాశనం చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే కాంపిటేటివ్ అథారిటీలైన రెవెన్యూ, కలెక్టర్, హెచ్ఎండీ, నార్సింగి మున్సిపాలిటీలు తగిన విధంగా స్పందించకపోవడంతో అక్రమణదారులది ఆడింది ఆట.. పాడింది పాట అన్న తీరుగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మారినా బీఆరెస్ పెద్దల అండతో అక్రమణలకు పాల్పడుతున్న ముఠా ఇంకా యథేచ్ఛగా తమ ఆగడాలను కొనసాగిస్తుండడంతో సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.