Site icon vidhaatha

కాంగ్రెస్ ఆరునెలల పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్ధకం … మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శలు

విధాత : గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరమని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమన్నారు. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారని, హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నదని, రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షించే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య అన్నారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఘటనకు కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆరెస్‌ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నామని తెలిపారు.

 

Exit mobile version