మళ్లీ సీఎంగా కేసీఆర్ ను చూసుకుందాం: కేటీఆర్

‘మనోళ్లు మంచోళ్ళు కాదని ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓడించలేదు.. సెంటిమెంట్ అస్త్రంతోనే కాంగ్రెస్ గెలుపు సాధించగలిగింది.. అంతమాత్రాన మొన్నటి ఫలితాలు

  • Publish Date - January 24, 2024 / 02:28 PM IST

– ఫలితాలు మనం దుప్పటి కప్పుకొని పడుకునేలా ఏమీ లేవు

– రైతులు వాళ్ళను చెప్పుతో కొడతారో, ఓటుతో కొడతారో?

– మహిళలకు 2500 ఇవ్వకపోతే తాట తీయాల్సి ఉంటుంది

– మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలి

– సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్

విధాత బ్యూరో, కరీంనగర్: ‘మనోళ్లు మంచోళ్ళు కాదని ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓడించలేదు.. సెంటిమెంట్ అస్త్రంతోనే కాంగ్రెస్ గెలుపు సాధించగలిగింది.. అంతమాత్రాన మొన్నటి ఫలితాలు మనం ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేలా లేవు… త్వరలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చూసుకుందాం’ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు అన్నారు. బుధవారం కరీంనగర్ లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మనం కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి చవి చూశాం. వన్ థర్డ్ సీట్లు గెలుచుకున్నాం. 14 సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయామని సూత్రీకరించారు. ఇది దరిద్రమైన ఓటమి కాదు… ప్రజలు మనల్ని ఛీ కొట్టినట్లు కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను 420 అంటే వారికి ఎక్కడలేని కోపం వస్తోందని, కానీ ఆ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్ ఇలా అన్నీ కలిపి 420 హామీలు ఉన్నాయన్నారు. ఈ హామీలన్నీ అమలు చేయకపోతే బట్టలూడదీసి కొట్టడం ఖాయమన్నారు.

– కోమటిరెడ్డి చెప్పుతో కొడతా అంటున్నారు..

రైతుబంధు నిధులు ఖాతాల్లో పడలేదంటే కోమటిరెడ్డి చెప్పుతో కొడతా అంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి వాళ్ళని రైతులు చెప్పులతో కొడతారో? ఓటుతో కొడతారో? ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన మహిళలు కోటి 57 లక్షల మంది ఉన్నారని, వారందరికీ నెలకు 2500 ఇవ్వకుంటే సోషల్ మీడియా వేదికగా తాటతీయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారాన్ని ఆయన తిప్పి కొట్టారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్, కోరుట్ల, గజ్వేల్, దుబ్బాక, హుజురాబాద్ ఇలా అనేక నియోజకవర్గాలలో, బీఆర్ఎస్ ఎవరి మీద గెలిచిందని ప్రశ్నించారు. ఈ ఫలితాలే ఎవరు ఎవరితో ఉన్నారో, ఎవరు ఎవరికి బీ టీంగా పనిచేస్తున్నారో స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే, బీజేపీ దేవున్ని రాజకీయాలకు వాడుకుంటున్నదని దుయ్యబట్టారు.

– ఐదేళ్లలో ఏం చేశారు?

ఎంపీగా ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. ఓ గుడి కానీ, బడి కానీ కట్టించింది లేదన్నారు. ఐదేళ్ల కరీంనగర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఆయన సంజయ్ కి సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు తమ పార్టీ నేత వినోద్ కుమార్ వస్తారని చెప్పారు.

– మైనారిటీలూ.. జాగ్రత్త

రాష్ట్రంలోని మైనారిటీలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒప్పందంతోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు వేరువేరు నోటిఫికేషన్లు వచ్చాయన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ వైపు చూసే మైనారిటీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీని ఓడించేది బీఆర్ఎస్ మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు.

– ఇది ఉద్యమ గడ్డ

గతంలో కరీంనగర్ పార్లమెంట్ నుండి కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించి ఢిల్లీ పంపించిన చరిత్ర ఇక్కడి ఓటర్లది అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరి ఊదిందన్నారు. 2009లో అలుగునూర్లో అగ్గిపుట్టించి తెలంగాణ రావడానికి కరీంనగర్ కారణమైందన్నారు.