Site icon vidhaatha

ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: పార్టీలు మారుతున్నా మా ఊరి ముఖచిత్రం మారడం లేదు. సంవత్సరాల తరబడి గ్రామానికి రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తున్నాం అంటూ గంగాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విసిగిన జనం ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన చేపట్టారు. మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండలం గంగపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, అటవీ శాఖ కార్యాలయానికి తాళాలు వేశారు.


ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో వాగు ఉందన్నారు. వర్షాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికీ ఏళ్ళు గడిచినా మా గ్రామానికి రోడ్డు మాత్రం వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రభుత్వాలు మారాయే తప్ప, మా ఊరు బాగుపడలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం, వాగుపై వంతెన నిర్మాణం జరుగుతుందని ఆశించినా నిరాశ మిగిలిందని వాపోయారు. ఇప్పటికైనా మా ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు కూడా వేయమని గ్రామస్తులు తీర్మానం చేశారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని,లేకుంటే అధికారులను గ్రామంలోకి రానివ్వమని హెచ్చరించారు.

Exit mobile version