- సర్వేలతో సాగుతున్న ప్రచార వార్
- ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో హంగ్
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ధి ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న సర్వేల వార్ సోషల్ మీడియా వేదికగా ఉదృతమవుతుంది. మేమంటే మేమే గెలుస్తామంటూ ఉగాది రోజున పార్టీల పంచాంగం తరహాలోనే సర్వేల రిపోర్టులతో పోటాపోటీ ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్లకు ముందు వరకు ప్రస్తుతమున్న పరిస్థితులకు లోబడి జరిగిన సర్వేలలో మెజార్టీ సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో హంగ్ పరిస్థితులను సైతం సూచిస్తున్నాయి. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించడం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి వెళితే బీఆరెస్ మాత్రమే ఇప్పటికి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. మ్యానిఫెస్టో వెల్లడించింది.
కాంగ్రెస్ కేవలం సగం మంది అభ్యర్థులనే ప్రకటించడం, ఆరు గ్యారెంటీలను ప్రకటించినా, మ్యానిఫెస్టో వెల్లడించలేదు. బీజేపీ తొలి జాబితాకే పరిమితమైంది. మ్యానిఫెస్టో ఊసులేదు. ఇంకా ప్రధాన పార్టీలు తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తులు, సీట్ల సర్ధుబాటులపైన స్పష్టత నివ్వలేదు. అటు సర్వే సంస్థలు మాత్రం ఇప్పటిదాకా ఉన్న క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా సర్వే తంతును మమా అనిపించేసి సర్వే ఫలితాలు ప్రకటించేస్తున్నాయి. సర్వే ఫలితాలు ప్రతికూలంగా ఉన్న పార్టీలు మాత్రం సర్వేలను నేతి బీరకాయలో నెయ్యి చందం అంటూ విమర్శ చేస్తున్నాయి.
తాజాగా వెల్లడైన ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే కూడా కాంగ్రెస్‌దే అధికారమని తేల్చేసింది. మూడోసారి అధికార సాధనకు గట్టి ప్రయత్నమే చేస్తున్న బీఆరెస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఒక్క చాన్స్ అంటూ అడుగుతున్న కాంగ్రెస్‌కు మధ్య ముఖాముఖీ పోటీ నెలకొందని ఈ సర్వే ఫలితాలు చాటుతున్నాయి. ప్రతిష్టాత్మక ఇండియా టూడే-సీ ఓటర్ సర్వే కూడా తమకు వ్యతరేకంగా రావడం బీఆరెస్ వర్గాలను టెన్షన్ పెట్టేలా కనిపిస్తుంది.
ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలోనూ హంగ్
ఇండియా టుడే సంస్థ సర్వేలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా హంగ్ ఏర్పడనుందని తేలింది. మొత్తం 119సీట్లలో కాంగ్రెస్‌కు 54సీట్లు, బీఆరెస్‌కు 49సీట్లు , బీజేపీకి 8సీట్లు , ఇతరులకు 8సీట్లు వస్తాయని వెల్లడైంది. కాంగ్రెస్‌కు 39శాతం ఓట్లు, బీఆరెస్‌కు 38శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. ఇటీవల ఏబీపీ-సీ ఓటర్ సంస్థ నిర్వహింంచిన సర్వే కూడా హంగ్ పరిస్థితినే సూచించింది. ఈ సంస్థ సర్వేలో కాంగ్రెస్‌కు 48-60, బీఆరెస్‌కు 43-55, బీజేపీకి 5-11సీట్లు, ఇతరులకు 5-11సీట్లు వస్తాయని తెలిపింది. మిగిలిన మూడు సంస్థలు మాత్రం కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ వస్తుందని తేల్చాయి.
వాటిలో పోల్ ట్రాకర్ అనే సంస్థ కాంగ్రెస్ 64,, బీఆరెస్‌కు 40, ఎంఎంఎంకు 6, బీజేపీకి 5, ఇతరులకు 4సీట్లు వస్తాయని చెప్పింది. జనమత్ సంస్థ కాంగ్రెస్‌కు 58-60, బీఆరెస్‌కు 45-47, ఎంఐఎంకు 6-7, బీజేపీకి 6-7, ఇతరులకు 2-3సీట్లు వస్తాయని తెలిపింది. ఇప్పటిదాకా వెల్లడైన సర్వేలన్ని కాంగ్రెస్ సొంత సర్వేలనంటూ బీఆరెస్ కొట్టివేస్తుంది. లోక్ పోల్ సంస్థ సర్వేలో కాంగ్రెస్‌కు 61-67, బీఆరెస్‌కు 45-51, ఎంఐఎంకు 6-7, బీజేపీకి 2-3సీట్లు, ఇతరులకు 1స్థానం వస్తాయని తేలింది. తెలంగాణ పల్స్ సంస్థ సర్వేలో కాంగ్రెస్‌కు 62-69, బీఆరెస్‌కు 46-54, ఎంఐఎంకు 5-7సీట్లు, బీజేపీకి 3-6సీట్లు వస్తాయని తెలిపింది.