విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లాలో పలు మున్సిపాలిటీలకు అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతోంది. బీఆరెస్ పార్టీ చేతిలో ఉన్న మున్సిపాల్టీలు ఒక్కోక్కటిగా కాంగ్రెస్ పార్టీ హస్తగత మవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పలువురు బీఆరెస్‌కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లా వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానాల ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. గత నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్‌లు మంచిర్యాల మున్సిపాల్టీ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జనవరి 11 న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను చేపడతామని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మెన్ పెంట రాజయ్య వైస్‌చైర్మన్ ముఖేష్ గౌడ్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మంచిర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానం సమావేశానికి గురువారం నాడు క్యాంప్ నుండి 26 మంది కౌన్సిలర్లు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయానికి తరలి వచ్చారు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో 26 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, మరో బీజేపీ కౌన్సిలర్ మద్దతు పలకడంతో 27 మందితోఅవిశ్వాస తీర్మానం నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల మున్సిపాల్టీని హస్తగతం చేసుకున్నట్లయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రావుల ఉప్పలయ్య చైర్మెన్‌గా చల్లా మహేష్ వైస్ చైర్మన్‌గా ఎన్నిక లాంఛనప్రాయమే.
నేడు నస్పూర్, బెల్లంపల్లిలలో అవిశ్వాసాలపై ఓటింగ్
ఇదే ఉత్సాహంతో రేపు నస్పూర్, బెల్లంపల్లి మునిసిపాల్టీలకు సైతం అవిశ్వాస తీర్మాన ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ రెండు కూడా మంచిర్యాల మున్సిపాలిటీ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ హస్తగతం కానున్నాయి. నస్పూర్ మున్సిపాల్టీ చైర్మెన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్‌లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపు శుక్రవారం ఓటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. 25 మంది కౌన్సిలర్లు నస్పూర్ మున్సిపాల్టీలో ఉండగా, 19 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు జారీ చేశారు. ఇదే రీతిలో బెల్లంపల్లి మున్సిపాల్టీలో సైతం శుక్రవారంనాడే అవిశ్వాస తీర్మానంపై అధికారులు ఓటింగ్ ప్రక్రియను బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
బెల్లంపల్లి మున్సిపాల్టీలో చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ ఛైర్మెన్ సుదర్శన్‌లపై బీఆరెస్ పార్టీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు జారీచేశారు. బీఆరెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అందరూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అవిశ్వాసానికి బలం చేకూరింది.