విధాత : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవటమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తుందని, కనీసం 12 నుంచి 14స్థానాలు గెలువాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశం సందర్భంగా తెలంగాణ లోక్‌సభ ఇంచార్జీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు భేటీ అయ్యారు. ఈ భేటీకి భట్టితో పాటు లోక్‌సభ ఇంచార్జీలుగా ఉన్న మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, సీతక్క, శ్రీధర్‌బాబు, దామోదరం రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ప్రభృతులు హాజరయ్యారు. సమావేశం అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై అధిష్టానం దిశానిర్దేశం చేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందేలా ప్రణాళికలు, యాక్షన్ ప్లాన్ రూపొందించి పనిచేయనున్నామన్నారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్లే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారన్నారు. సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలని ఏఐసీసీని అభ్యర్థించామని, భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపామన్నారు. ఏఐసీసీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశం అంతటా కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. దేశ సంపద దేశ ప్రజలకు, దేశానికి చెందాలన్నారు. అలా కాకుండా బీజేపీ పాలనలో కొందరు పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడం జరుగుతుందని అది సరికాదని ప్రజలు భావిస్తున్నారు.