హరీశ్ ప్రోద్బలంతోనే సీఎంను కలిసిన మెదక్ ఎమ్మెల్యేలు

మెదక్ బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం వెనుక మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రొద్భలం ఉందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆసక్తికర కామెంట్లు

  • Publish Date - January 24, 2024 / 10:43 AM IST
  • బీజేపీ నేత రఘునందన్‌రావు హాట్ కామెంట్స్‌

విధాత : మెదక్ బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం వెనుక బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రొద్భలం ఉందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆసక్తికర కామెంట్లు చేశారు. బుధవారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ కర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆరెస్‌కు అనుభవంలోకి వస్తోందని.. ఎవరు చేసుకున్నది వారికే తిరిగి వస్తుందనడానికి ఆ నలుగురు బీఆరెస్‌ ఎమ్మెల్యేలు సీఎంను కలవడమే నిదర్శనమన్నారు. భూమి గుండ్రంగా ఉంటదని.. మనమేం చేస్తే అదే తిరిగి వస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో మెజార్టీ ఉన్నాకూడా అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రతిపక్ష పార్టీలను చీల్చడం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తోందన్నారు. పార్టీలను చీల్చడానికి, ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బీఆరెస్‌కు ఏడేండ్లు పడితే కాంగ్రెస్‌కు ఏడు నెలలు కూడా పట్టడం లేదన్నారు.


బీఆరెస్‌లో బావ బామ్మర్ధులకు పడటం లేదని, 2009లో కేసీఆర్ అధ్యక్ష పీఠం గుంజుకోవడానికి జరిగిన కొట్లాట మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతోందన్నారు. బీఆరెస్‌ అధ్యాయం మొన్నటి ఎన్నికలతో ముగిసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆరెస్ పెద్ద జీరో అవుతుందన్నారు. అధికారం కోల్పోయినా ఇంకా తాము అధికార పార్టీ అన్నట్లుగా బీఆరెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తిరస్కరించిన తరువాత కూడా బీఆర్‌ఎస్ నేతల్లో మార్పు రావడం లేదన్నారు. కవిత మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఆ జిల్లా నేతలు, ఎమ్మేల్యేలు అలెర్ట్ అవుతున్నారన్నారన్నారు. ప్రోటోకాల్ అంటే ఏమిటో తమకు నిన్నటి వరకు గుర్తు లేదా అని బీఆరెస్ ఎమ్మెల్యేలను నిలదీశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.


ఈ దుష్ట సంప్రదాయం తెచ్చిందే బీఆరెస్ పార్టీ అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటనడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అయితే ఇక ఎన్నికల అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. బీజేపీకి ఈసారి రాష్ట్రంలో 16 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆరెస్‌కు 12 సీట్లు అనడం భ్రమ అని.. 90 సీట్లతో అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి సింగిల్ డిజిట్ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ పార్టీని గల్లీలో కాంగ్రెస్ రానియదని.. ఢిల్లీలో బీజేపీ రానియదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆరెస్‌కు ఓటు వేస్తే అది మూసీ, బంగాళాఖాతంలో వేసినట్లేనన్నారు.