Puja for Lord Ganesh | వినాయక చవితి( Vinayaka Chavithi ) వేడుకలు ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు.. విదేశాల్లోనూ గణేశ్ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ( Telangana )కు చెందిన కొంత మంది భక్తులు( Devotees ).. అమెరికా( America ) డల్లాస్‌లోని హానీక్రీక్ కాలనీలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తమ భక్తిని చాటుకున్నారు. ఇక విఘ్నేశ్వరుడికి నిత్యం పూజలు చేస్తున్న వారు.. టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. డల్లాస్‌లోని వినాయకుడికి పూజారితో పూజలు చేయించాలన్న సంకల్పంతో.. విర్చువల్‌గా పూజలు చేయించి భక్తిని చాటుకున్నారు.
మరి ఈ పూజారి ఎవరంటే..?
మెదక్ జిల్లాలోని పేరూరు మండలంలోని సరస్వతి ఆలయంలో ప్రధాన పూజారిగా దోర్బల మహేశ్ శర్మ( Dorbala Mahesh Sharma ) (39) గత కొన్నేండ్ల నుంచి పురోహితుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వినాయక నవరాత్రులు కొనసాగుతుండడంతో తీరిక లేకుండా ఉన్నారు. అయినప్పటికీ విదేశాల్లో ఉన్న తమ భక్తుల కోసం.. మహేశ్ శర్మ ప్రత్యేక సమయం కేటాయించారు. డల్లాస్‌లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహానికి విర్చువల్‌గా పూజలు చేసి, ఆ భక్తులను ఆశీర్వదించారు మహేశ్ శర్మ.
సిద్దిపేట( Siddipeta ) కోటి లింగాల టెంపుల్ వేదిక్ పాఠశాలలో శర్మ యజుర్వేద విద్యను పూర్తి చేశారు. 25 ఏండ్ల క్రితమే తన విద్యాభ్యాసం పూర్తి కాగా, తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 2009 నుంచి ఆన్‌లైన్‌లో పూజలు చేయడం ప్రారంభించారు. 2009లో తొలిసారిగా ఆయన ఆడియో కాల్ ద్వారా అమెరికాలో ఉంటున్న దంపతులకు నాగ దోష పూజ నిర్వహించారు. అప్పట్లో వీడియో కాల్స్ అంతగా పాపులారిటీ చెందలేదు. అమెరికా, యూకే, కెనడాతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు వారి కోసం అప్పట్నుంచి ఆన్‌లైన్‌లో పూజలు చేయడం ప్రారంభించినట్లు శర్మ పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న శర్మను వారంతా హైటెక్ పంతులు అని ముద్దుగా పిలుచుకుంటారు.