నా మిత్రుడు అంటూనే మెదక్ మున్సిపల్ చైర్మన్ పై మంత్రి రాజనర్సింహ ఫైర్

‘నా మిత్రుడు...అంటూనే మెదక్ మున్సిపల్ చైర్మన్ పై మంత్రి దామోదర్ రాజనర్సింహ అభివృద్ధికి నిధులు అడిగిన పాపానికి...గుస్సా అయ్యారు

  • Publish Date - January 6, 2024 / 12:47 PM IST

– అప్పులు చేసి.. నిధులు అడుగుతారా?

– మెదక్ మున్సిపల్ చైర్మన్ పై మంత్రి గుస్సా

– గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది

– ఎక్కడా ఇల్లు, జాగాలు కనబడడం లేదు

– ఉద్యోగ నియామకాలనూ మర్చింది

– మంత్రి దామోదర్ రాజనర్సింహ

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ‘నా మిత్రుడు…అంటూనే మెదక్ మున్సిపల్ చైర్మన్ పై మంత్రి దామోదర్ రాజనర్సింహ అభివృద్ధికి నిధులు అడిగిన పాపానికి…గుస్సా అయ్యారు. బీఆర్ఎస్ కి చెందిన మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మెదక్ అభివృద్ధి కోసం ప్రజాపాలన కార్యక్రమంలో నిధులు మంజూరు చేయాలని కోరగా, తన మిత్రుడు అంటూనే.. ‘మీ ప్రభుత్వం 60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మీకు నిధులు మంజూరు కావాలా?’ అంటూ గత ప్రభుత్వంపై మంత్రి విమర్శల జడివాన కురిపించారు. ఈ సంఘటనకు శనివారం మెదక్ సాయిబాలాజి గార్డెన్ లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం వేదికైంది. మెదక్ పట్టణంలోని 29, 30, 31 వార్డుల ప్రజా పాలన కార్యక్రమం స్థానిక సాయిబాలాజి గార్డెన్ లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేష్ తో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మెదక్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఇది నోట్ చేసుకున్న మంత్రి తన ప్రసంగంలో ‘చైర్మన్ తన మిత్రుడే.. అంటూ ‘నిధులు కావాలా? ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల గత మీ (బీఆరెస్) ప్రభుత్వం అప్పులు చేసింది’ అని మండిపడ్డారు. ఎక్కడా అభివృద్ధి లేదు, ఇండ్లు లేవు, అప్పులకు వడ్డీలు కడుతూ, పాలనను గాడిలో పెడుతున్నాం..’ అంటూ మంత్రి దామోదర్ రాజనర్సింహ చైర్మన్ పై గుస్సా అయ్యారు.



 



‘ ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అహంకారపు మాటలు.. అభివృద్ధి డొల్ల, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం లక్షా తొంభై నాలుగు వేల ఉద్యోగాలు నింపాల్సి ఉండే. అవి ఏవీ చేయకుండా అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు’ అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సమన్వయం చేసుకుంటూ అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని మంత్రి అన్నారు. వ్యవస్థ శాశ్వతం.. వ్యక్తులు కాదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. నాయకులు గెలుస్తారు, ఓడిపోతారు.. వ్యవస్థ గొప్పదన్నారు. మంత్రి రియాక్షన్ చూసి చైర్మన్ ఖిన్నుడయ్యారు. అధికారులు ఆలోచనలో పడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం మొదలైంది..

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన మొదలైందని, అధికారులే వార్డులు, గ్రామాలకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటున్నారని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈనెల 28 నుంచి మొదలుకొని శనివారం వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వార్డుల్లో ప్రజా పాలన కొనసాగిందని అన్నారు. 6 గ్యారెంటీలను కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నిధులు, నియామకాలపై ఉద్యమం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. 6 గ్యారంటీలలో ఇప్పటికే ప్రభుత్వం 2 గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు.


అంచలంచెలుగా 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం అని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గల్లీ గల్లీ…గ్రామగ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, సుప్రభాత రావు, రాంచందర్ గౌడ్, జీవన్ రావు, గంగా నరేందర్, బొజ్జ పవన్, అంజా గౌడ్, రెడ్డి పల్లి ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా నర్సాపూర్ నియోజకవర్గంలోని రుస్తుంపెట్, దుబ్బాక నియోజకవర్గం చేగుంట, గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రహాలకు మంత్రి హాజరుకాగా, నర్సాపూర్ లో మంత్రి వెంట ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.