Site icon vidhaatha

Minister Jupally | బీఆరెస్ హత్యా రాజకీయాలు విచారకరం: మంత్రి జూపల్లి

విధాత: వనపర్తిలో బీఆరెస్ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని సంబంధం లేని నాపై కేటీఆర్‌, ఆరెస్పీలు అర్ధం పర్ధం లేని అసత్య ఆరోపణలు చేస్తూ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి హత్య అంశంపై బీఆరెస్‌ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందని, మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని, గతంలో మా కార్యకర్తలు మరణించినప్పుడు నేను ఇలా ఆరోపణలు చేయలేదన్నారు.శ్రీధర్‌రెడ్డి హత్యను తాను కూడా ఖండిస్తున్నానన్నారు.

వేర్వేరు కారణాలతో జరిగిన హత్యలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదన్నారు. శ్రీధర్ రెడ్డికి ఆయన కుటుంబంలోనే ఆస్తి, భూ తగాదాలున్నాయని, ఆ ఊర్లో ఆయన బాధితులు ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే కు ఆయన బంధువు కూడా అని తెలిపారు. హత్యలో నా హస్తం ఉందని పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ ఎలా మాట్లాడుతారన్నారు. కేటీఆర్‌, ఆరెస్పీ ఆరోపించిన దానిపై వారు క్షమాపణలు చెప్పాలన్నారు. తాను పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరడంతో రాష్ట్రంలో బీఆరెస్‌కు అధికారం దూరమైందని, అప్పటి నుంచి బీఆరెస్ నేతలు తనపై కక్షకట్టారని గుర్తు చేశారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, నన్ను బీఆరెస్ నుంచి బర్తరఫ్‌ చేసినందుకే మిమ్మలని జనాలు బర్తరఫ్ చేశారని జూపల్లి చురకలేశారు. నన్ను ప్రశ్నించే అర్హత కేటీఆర్ కు లేదని, నేరెళ్ళ ఘటనలో దళితులను హింసించిన వాళ్ళు నాపై మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో రాజకీయ హత్య జరిగిందని తనపై ఆరోపణలు చేశారని.. ఆ హత్య కూడా భూ వివాదం వల్లే జరిగిందని తేలిందన్నారు. గండ్రపల్లి, లక్ష్మీపల్లిలో రెండు హత్యలపై వాస్తవాలు ప్రజలే చెబుతారని స్పష్టం చేశారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్మీపల్లికి రావాలని జూపల్లి సవాల్ విసిరారు. లక్ష్మీపల్లి కూడలికి వస్తే ప్రజలు ఏది చెబితే అది చేద్దామన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు పెడతానని హెచ్చరించారు.

Exit mobile version