కేసీఆర్ శకం ముగిసింది: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో కేసీఆర్ శకం ఇక ముగిసిందని, పార్లమెంటు ఎన్నికల్లో బస్సు యాత్ర కాదు మోకాళ్ళు యాత్ర చేసినా బీఆరెస్‌కు ఒక్క సీటు రాదని, నల్గొండ, భవనగిరిలో

  • Publish Date - April 23, 2024 / 07:07 PM IST

బస్సు యాత్ర కాదు..మోకాళ్ల యాత్ర చేసినా బీఆరెస్‌కు ఒక్క సీటు రాదు
13-14 పార్లమెంట్ సీట్లు గెలబోతున్నాం
బీఆరెస్ నేతల గూర్చి గుత్తా సరిగానే చెప్పారు

విధాత : తెలంగాణలో కేసీఆర్ శకం ఇక ముగిసిందని, పార్లమెంటు ఎన్నికల్లో బస్సు యాత్ర కాదు మోకాళ్ళు యాత్ర చేసినా బీఆరెస్‌కు ఒక్క సీటు రాదని, నల్గొండ, భవనగిరిలో డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నల్గొండ జిల్లాలను నాశనం చేశారని, కృష్ణా నీటి జలాలు పంపకంలో జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారని, కేసీఆర్ వలనే జిల్లాకి కరువు వచ్చిందని ఆరోపించారు. మిర్యాలగూడకి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని వస్తారని, పదేళ్లలో తెలంగాణను సర్వనాశనం చేసి ఇప్పుడు బస్సు యాత్ర చేయడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలని విమర్శించారు. పదేళ్ళలో ఏమి చేయని కేసీఆర్.. బస్సు యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చేతనైతే మెదక్ స్థానం ఒక్కటి గెలిపించుకోవాలని సవాల్ చేశారు. నల్గొండ, భువనగిరిలోని బీఆరెస్‌ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారని ఎద్దేవా చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోందని, దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి లభిస్తున్న ఆదరణతో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. నేను పిలిస్తే పార్టీలోకి రావడానికి 25 మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. బీఆరెస్ నేతల గూర్చి, జిల్లా మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి గురించి గుత్తా సుఖేందర్ రెడ్డి సరిగానే చెప్పాడని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. నేడు నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారని,ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Latest News