Minister Komatireddy | జనాన్ని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..!

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన బిజీ షెడ్యూల్‌ నుంచి విరామం తీసుకుని ఓట్లేసిన నియోజకవర్గం ప్రజలకు ఎట్టకేలకు సమయమిచ్చారు

నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యానంటూ ట్వీట్‌ !!

విధాత: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన బిజీ షెడ్యూల్‌ నుంచి విరామం తీసుకుని ఓట్లేసిన నియోజకవర్గం ప్రజలకు ఎట్టకేలకు సమయమిచ్చారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే వెంకట్‌రెడ్డిని కలవాలంటే జనం నల్లగొండ నియోజకవర్గం నుంచి వ్యయప్రయాసలు భరించి వెళ్లి అక్కడ ఆయనను కలిసేందుకు గంటల కొద్ది వేచి ఉన్నా కలువలేకపోతుండటం పట్ల ఇటీవల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక సచివాలయంలో మంత్రిని కలవడం అంత ఆషామాషి కాదు.

నల్లగొండలో ఆయన నివాసం ఉన్నప్పటికి అక్కడికి ఎప్పుడొస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. ఆయన ప్రధాన అనుచరులు నలుగురైదుగురికి తప్ప ఆయన రాకపోకల సమాచారం తెలియదు. అధికారిక కార్యక్రమాల్లో ఆయనను కలవడం సామాన్యులకు దుర్లభం. మంత్రి చుట్టు ఉన్న కోటరి ఆయనను మరోసారి ముంచే దిశగా నడిపిస్తుందన్న వాదన వినిపిస్తుంది. ఎన్నికల్లో నిత్యం మీకు అందుబాటులో ఉంటానంటూ చెప్పిన వెంకట్‌రెడ్డి మంత్రి అయ్యాక జనానికి దూరమవుతూ కేవలం చుట్టు ఉండే నాయకులు, పైరవీ కారులు, కాంట్రాక్టర్లు, అధికారుతో సమావేశాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు చోటుచేసుకున్నాయి.

ఇక దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లుగా వెంకట్‌రెడ్డి పీఏలు, గన్‌మెన్ల నిర్వాకం అంత ఇంతకాదు. మంత్రిని కలిసేందుకు వచ్చిన వారి సమాచారాన్ని ఆయనకు చెప్పకుండానే చెప్పినట్లుగా, మంత్రి పేరుతో వారే సమాధానాలు చెప్పడం వంటి అతి చేస్తున్నారు. దీంతో అసలు తమ సమస్య మంత్రి దాకా చేరిందే లేదో తెలియక గందరగోళంతో మరికొంతమంది మంత్రి ఇంటి చుట్టు ప్రదక్షిణలు చేసి నిరాశతో వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రతిపక్ష బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం ఇటీవల రింగ్‌ రోడ్డు బాధితుల సమావేశంలో ప్రస్తావించడం వైరల్‌గా మారింది.

విషయం వెంకట్‌రెడ్డి దాకా చేరిందో ఏమోగాని రెండు రోజుల పాటు నల్లగొండ నివాసంలో వెంకట్‌రెడ్డి నియోజకవర్గం వాసులను కలిసే పనిపెట్టుకున్నారు. అయితే అటు హైదరాబాద్‌లోగాని, ఇటు నల్లగొండలోగాని తనను పలు సమస్యలపై కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆయన విడివిడిగా కలువకుండా గుంపుల మధ్య కలుస్తుండటంతో తమ సమస్యలను చెప్పుకోవడంలో జనం ఇబ్బందులు పడ్డారు. కొందరైతే అంతమందిలో తమ సమస్యను ఆయనకు వినిపించే అవకాశం లేక అసంతృప్తితో వెనుతిరిగారు.

చిత్రంగా వెంకట్‌రెడ్డి తన ట్విటర్‌లో తాను నల్గొండ పట్టణంలోని నా నివాసంలో రెండు రోజుల పాటు నియోజకవర్గ ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం జరిగిందని జనాన్ని కలిసిన ఫోటోలతో ట్వీట్‌ పెట్టుకున్నారు. అసలు రాజకీయ నాయకులు..ప్రజా నాయకుడు..ఎమ్మెల్యే లేదా మంత్రి అంతా ప్రజల సమస్యల ప్రాతిపదికగానే ప్రధానంగా తమ కార్యకలాపాలు సాగిస్తుంటారు. అలాంటప్పుడు నేను ప్రజలతో మమేకమయ్యానంటూ మంత్రి వెంకట్‌రెడ్డి ట్వీట్‌ పెట్టుకోవడం ఎక్కడి విడ్డూరమంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.