Minister Konda Surekha | ‘జనహితానికి’ మంత్రి సురేఖ వస్తారా! పార్టీ శ్రేణుల్లో అనుమానం

Minister Konda Surekha | ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు సురేఖ, సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీతక్క హాజరవుతారా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే సురేఖ వస్తారా? లేదా? అనే అంశం పైనే సర్వత్రా ఆసక్తినెలకొంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా విభేదాలు, పరిణామాలు ఇందుకు కారణమనేది అందరికీ తెలిసిన విషయమే. 

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Minister Konda Surekha | కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర కార్యక్రమంపై శనివారం నిర్వహిస్తున్న సమావేశానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి  కొండా సురేఖ హాజరవుతారా? అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సురేఖ హాజరవుతారా? దూరంగా ఉంటారా?  అనే అనుమానాలు ఆ పార్టీ వర్గాలను వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ  ప్రకటన ప్రకారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు హాజరుకావాలని కోరారు. ఈ సమావేశానికి పార్టీ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పార్టీ ఈ యాత్రకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు సురేఖ, సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీతక్క హాజరవుతారా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే సురేఖ వస్తారా? లేదా? అనే అంశం పైనే సర్వత్రా ఆసక్తినెలకొంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా విభేదాలు, పరిణామాలు ఇందుకు కారణమనేది అందరికీ తెలిసిన విషయమే.

విభేదాల నేపథ్యంలో మీటింగ్

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనాయకుల మధ్య నెలకొన్న తీవ్రమైన విభేదాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. పార్టీ ముఖ్యనాయకుల మధ్య పీటముడిపడిన విభేదాలు తేలకుండానే తాజాగా ఈమీటింగ్ నిర్వహించడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పటికీ ఉప్పూ నిప్పులా విభేదాలు కొనసాగుతున్నాయి. గత మూడు నెలలుగా ఈ విభేదాలకు పరిష్కారం లభించని విషయం తెలిసిందే. మంత్రి సురేఖ, కొండా మురళి దంపతులతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ తదితరులతో నెలకొన్న విభేదాలు తెలిసిందే. ఈ సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు.  రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వద్దకు వెళ్ళిన  ఈ వివాదం పై ఎవరిపై చర్యలు తీసుకోలేదు. ఇటీవల దీని పరిష్కారానికి నలుగురు నాయకులతో కమిటీ వేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. తమను బహిరంగంగా తిట్టిన కొండామురళి పై చర్యలు చేపట్టకుండా పార్టీ అధిష్టానం దాటవేత వైఖరితో వ్యవహరిస్తుందని అనుచరుల వద్ద వాపోతున్నారు. పార్టీలో తమ పరపతి సన్నగిల్లుతోందని, తమ ఫేస్ వాల్యూ తగ్గుతోందని మథనపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించకుండా నానపెడుతున్నట్లు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

మంత్రి సురేఖతో దూరం

మంత్రితో విభేదాలు ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యేలంతా ఒక వైపుగా మంత్రి సురేఖ మరో వైపుగా గ్రూపులు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొనగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ హాజరుకాలేదు. స్థానిక ఎమ్మెల్యే నాయిని స్థానికంగా లేనప్పటికీ మిగిలినవారంతా వరంగల్‌లో జరిగిన మంత్రి పొంగులేటి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ముందు హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్, డబుల్ బెడ్ రూమ్ల పంపిణీకి మంత్రి దూరంగా ఉన్నారు. తాజాగా రాజీవ్ జయంతిలో వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్గాలవారీగా జిందాబాద్లు కొట్టుకున్నారు. శుక్రవారం మంత్రి సురేఖ రెండు జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో మేయర్ సుధారాణి తప్ప ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో శనివారం జరిగే జనహిత పాదయాత్ర సమీక్షా సమావేశానికి ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు హాజరవుతున్నందున మంత్రి పాల్గొంటారా? మంత్రి సురేఖ పాల్గొంటే మిగిలిన వారు హాజరవుతారా? అనే చర్చ సాగుతోంది. హాజరైతే వీరంతా చేతులు కలుపుతారా? అంటీముట్టనట్లు వ్యవహరిస్తారా? అనే ఉత్కంట నెలకొంది.